‘స్వచ్ఛమైన వినోదాత్మకచిత్రం ‘మిత్రమండలి’. పిల్లలతో కలిసి హాయిగా ఈ సినిమా చూడొచ్చు. ఈ దీపావళికి ముందు మేమే వస్తున్నాం. తొలి సిక్సర్ మాదే. మా తర్వాత వస్తున్న సినిమాలు కూడా సిక్సులు కొట్టాలి. బాగా ఆడాలి. పరిశ్రమలో అంతా బాగుండాలి. అంతేతప్ప పక్క సినిమాను తొక్కుతూ మనం మాత్రమే ఎదగాలి అనుకోవడం అవివేకం. జనం సినిమా బాగుంటే చూస్తారు. బాగుండకపోతే ఎంతటి పెద్ద సినిమానైనా పక్కనపెడతారు. కాబట్టి ఇక్కడ గౌరవించాల్సింది ప్రేక్షకుల్ని మాత్రమే.
నా సినిమాను ఎవరు ట్రోల్ చేసినా సరే.. నేను పరిగెడుతూనే ఉంటా. పరిగెత్తడంలోనే నా విజయం ఉంది. ఎవరైనా ఆరోగ్యకరంగా పోటీపడదాం.’ అని నిర్మాత బన్నీవాస్ అన్నారు. ఆయన సమర్పకుడిగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘మిత్రమండలి’.
ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం జంట నటించారు. విజయేందర్ దర్శకుడు. కల్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా.విజేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. గురువారం సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో బన్నీవాస్ మాట్లాడారు. ప్రముఖ హీరో శ్రీవిష్ణు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
‘ ‘మిత్రమండలి’ నేను చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం మీకు నచ్చకపోతే నెక్ట్స్ వచ్చే నా ఏ సినిమానీ మీరు చూడొద్దు.’ అని ప్రియదర్శి నమ్మకంగా చెప్పారు. ఇంకా నిహారిక ఎన్ఎం, డైరెక్టర్ విజయేందర్, నిర్మాతలు భానుప్రతాప, డా.విజేందర్‌రెడ్డి తీగల, సంగీత దర్శకుడు ధృవన్ కూడా మాట్లాడారు.