Glenda Jackson | రెండుసార్లు ఆస్కార్ విజేత, బ్రిటీష్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు గ్లెండా జాక్సన్ (87) కన్నుమూశారు. స్వల్ప ఆరోగ్య సమస్యలతో లండన్‌లోని తన ఇంట్లో గురువారం మరణించిందని ఆమె ఏజెంట్ లియోనెల్ లార్నర్ పేర్కొన్నారు. ఆమె ఇటీవల ‘ది గ్రేట్ ఎస్కేపర్’ చిత్రం షూటింగ్లో పాల్గొన్నారు. ఇందులో ఆమె మైఖేల్ కెయిన్‌తో కలిసి నటించారు. జాక్సన్ 1960, 70లో అతిపెద్ద బ్రిటీష్ స్టార్లలో ఒకరు ‘విమెన్ ఇన్ లవ్’ కోసం రెండు అకాడమీ అవార్డులను అందుకున్నారు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి పార్లమెంట్‌కు ఎన్నికై లేబర్ పార్టీ సభ్యురాలిగా 23 సంవత్సరాలు గడిపారు. పార్లమెంట్ సభ్యత్వం ముగిసిన తర్వాత మళ్లీ నటన వైపు దృష్టి పెట్టారు. షేక్స్పియర్ ‘కింగ్ లియర్’లో టైటిల్ క్యారెక్టర్‌తో సహా పలు పాత్రలతో మెప్పించింది. జాక్సన్ BAFTA (British Academy of Film and Television Arts) అవార్డును సైతం అందుకున్నారు. అలాగే ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ యాక్టింగ్ గ్రహీత, రెండు ఆస్కార్లు, మూడు ఎమ్మీ అవార్డులు, టోనీ అవార్డులు దక్కాయి. 1971లో ‘ఉమెన్ ఇన్ లవన్’లో ఉత్తమ నటిగా తొలిసారిగా ఆస్కార్ అందుకున్నారు. 1974లో ‘ఎ టచ్ ఆఫ్ క్లాస్’కు మరో అవార్డు దక్కింది.
1972లో ఎలిజబెత్ ఆర్ అనే మిని సిరీస్‌లో నటనకు గాను రెండు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులను అందుకున్నారు. 2018లో ఆమె టోనీ అవార్డును అందుకుంది. కెరీర్ విజయవంతంగా సాగుతున్న తరుణంలోనే రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు నటనకు విరామం ప్రకటించారు. 1992లో తొలిసారిగా బ్రిటీష్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తర్వాత 1997లో టోనీ బ్లెయిర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ కార్యదర్శి నియామకమయ్యారు. ఆమె 1958లో నటుడు రాయ్ హోడ్జెస్ను వివాహం చేసుకున్నారు. 1976లో విడాకులు తీసుకున్న ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఆమెకు కొడుకు డేనియల్ హోడ్జెజ్ ఉన్నారు.