Brigida Saga | తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి బ్రిగిడా సాగా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇటీవల తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ డస్కీ బ్యూటీ, ఇప్పుడు తన ప్రియుడు అనంత్‌తో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి. బ్రిగిడా సాగా తమిళ టెలివిజన్, వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో ‘ఆహా కళ్యాణం’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, తన సహజ నటన, ఆకట్టుకునే అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ‘సింధూరం’, ‘పెదకాపు’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.
ఇటీవల సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా బ్రిగిడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే కోలీవుడ్ నటుడు అనంత్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అనంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ తమ ప్రేమ విషయాన్ని అభిమానులతో షేర్ చేసింది. ఆ ప్రకటన జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు ఇద్దరూ తమ బంధాన్ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో బ్రిగిడా సాగా – అనంత్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.
ఎంగేజ్మెంట్ సందర్భంగా తీసుకున్న అందమైన ఫోటోలను బ్రిగిడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఈ జంట ఎంతో ఆనందంగా కనిపించడంతో అభిమానులు ఫోటోలకు భారీగా స్పందిస్తున్నారు. కొద్ది సేపట్లోనే ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు, సన్నిహితులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానులు కూడా క్యూట్ కపుల్, హ్యాపీ ఎంగేజ్మెంట్ , ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిగిడా సాగా పలు తమిళ, తెలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ జంట పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.