‘తమ్ముడు నారాయణమూర్తి తేనెటీగలాంటి మనిషి. ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. అన్ని చోట్లా తేనె పోగేసుకొని వచ్చి తలా ఒక చుక్క పంచిపెట్టాలి అనే సంకల్పం ఉన్న వ్యక్తి. అందమైన హీరో ఎవరని అడిగితే నేను నారాయణమూర్తి పేరు చెబుతా. అందం అంటే గ్లామర్ కాదు. సేవాభావం, దయాగుణమే నిజమైన అందం. నారాయణమూర్తి నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తారు. పేదల పక్షాన నిలుచుంటాడు’ అని అన్నారు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. ఆర్.నారాయణమూర్తి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ‘యూనివర్సిటీ పేపర్‌లీక్’ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశానికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
ఇంకా చెబుతూ ‘నారాయణమూర్తికి ఉన్న జ్ఞానానికి ఊతం ఇచ్చి ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తాడు. సమాజపు భారాన్ని తన భుజాన వేసుకొని మోస్తున్న వ్యక్తి నారాయణమూర్తి. పేపర్ లీకేజీల వల్ల ఎంతో మంది బలైపోతున్నారు. సమాజాన్ని మేల్కొలిపే ఇలాంటి చిత్రాల్ని అందరూ చూడాలి. నాకు తెలిసినప్పటి నుంచి నారాయణమూర్తి ఒకేలా ఉన్నారు. నలభైఏళ్ల కెరీర్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా జీవితాన్ని గడుపుతున్నాడు. నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. నారాయణమూర్తి అంటే ఇష్టం’ అన్నారు. ఈ సినిమా ఉద్దేశించి మాట్లాడుతూ..‘ఈ దేశాన్ని మళ్లీ బడిలో వేయాలి’ అని వ్యాఖ్యానించారు బ్రహ్మానందం. తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం మహానటుడు, జ్ఞాని..అన్నింటికి మించి మంచి మాస్టారు. అందుకే ఆయనకు సినిమా చూపించానని, ఆయన ప్రసంగం వింటుంటే ఆనందబాష్పాలను ఆపుకోలేకపోయానని ఆర్.నారాయణమూర్తి భావోద్వేగానికి గురయ్యారు.