Brahmanandam | ‘నటులు వయసును దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు ఉండలేకపోతున్నాననే విషయం నాకు కూడా తెలుసు. ప్రేక్షకులు మనల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలి. అందుకే సినిమాలను తగ్గించాను. అంతే కాని..నాకు అవకాశాలు రాక కాదు. చేయలేక కాదు’ అన్నారు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం.
తనయుడు రాజా గౌతమ్‌తో కలిసి ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఫిబ్రవరి 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడే..నేను తాతగా, మా కుమారుడు మనవడిగా అంటే కొత్తగా అనిపించింది. షూటింగ్ టైమ్‌లో వెన్నెల కిషోర్‌ను చూస్తే నవ్వొచ్చేది. చాలా సరదాగా ఉంటాడు.
నా లెగసీని కొనసాగించే కమెడియన్లలో వెన్నెల కిషోర్ ఒకరు’ అన్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఘనత మెడలో బోర్డులు వేసుకొని మాత్రమే తిరగడానికి పనికొస్తుందని, నటులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ స్వీయ విమర్శ తో ముందుకెళ్లాలని బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు. బ్రహ్మానందంగారు అంటేనే కింగ్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ కామెడీ అని వెన్నెల కిషోర్ పేర్కొన్నారు. బ్రహ్మా ఆనందం అనే సినిమాను బ్రహ్మానందంగారితో చేయడం గొప్ప సంతృప్తినిచ్చిందని నిర్మాత రాహుల్ యాదవ్ తెలిపారు.