Laila Movie | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లైలా చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక వర్గానికి కోపం తెప్పించాయి.
వివరాల్లోకి వెళితే.. విశ్వక్ నటిస్తున్న తాజా చిత్రం లైలా (Laila). ఈ సినిమాకు దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా.. సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపాడు. అయితే ఈ వేడుకలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేం పృథ్వీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైసీపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
ఈ సినిమాలోని ఓ సన్నివేశం గురించి పృథ్వీ చెబుతూ.. ఇందులో నేను మేకల సత్తిగా చేశానని తెలిపారు.
అయితే మేకలు ఎన్ని ఉన్నాయని షాట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయని తెలిపాను. అయితే షాకింగ్ ఎంటో కానీ సినిమా చివరిలో లెక్కేస్తే మొత్తం 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాలో బ్రహ్మాండంగా పెట్టారంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్లు వైసీపీని ఉద్దేశించే చేశాడంటూ వైసీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో 151 సీట్లు గెలిచిన వైసీపీ గత ఎన్నికలలో 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. దీంతో పృథ్వీ వైసీపీ గురించే కామెంట్లు చేశాడని లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్‌ని స్టార్ట్ చేశారు. మరోవైపు ఈ వివాదం ముదరకముందే చిత్రబృందం నేడు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.