Boyapati sreenu next movie | మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్లో థియేటర్లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. ఒకటి రెండు వారాలు సినిమాలు ఆడటమే గగనమైన ఈ రోజుల్లో కూడా 50 రోజులు పూర్తి చేసుకుంది అఖండ. 50 రోజుల వరకు కూడా పలు థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ప్రభంజనం థియేటర్ల నుంచి ఓటీటీలో కూడా కొనసాగింది. డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయి అక్కడ కూడా రికార్డులు తిరగరాసింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బోయపాటి.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టిపెడుతున్నాడు. మొన్నటివరకు ఈయన తర్వాత సినిమాల అల్లు అర్జున్‌తో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే బన్నీతో వెంటనే సినిమా అంటే కష్టమనిపిస్తుంది. దీంతో బన్నీ సినిమా కంటే ముందు మరో యంగ్ హీరోతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి.
పుష్ప సినిమా మొదటి పార్ట్ తర్వాత అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకుని బోయపాటి సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ సినిమా అయిపోయాక పుష్ప 2 షూటింగ్లో పాల్గొంటున్నాడని ముందు నుంచి వార్తలు వచ్చాయి. కానీ పుష్ప సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ను చూసిన బన్నీ.. వీలైనంత త్వరగా పుష్ప 2 ను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. దీంతో తన ఫోకస్ మొత్తాన్ని పుష్ప సినిమాపైనే ఉంచాడు. పుష్ప 2 పూర్తయ్యే సరికి కనీసం ఏడు ఎనిమిది నెలల సమయం పడుతుంది. కాబట్టి బోయపాటి సినిమా ఇప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. దీంతో ఈ గ్యాప్‌లో ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ సినిమాను బోయపాటి తెరకెక్కించనున్నట్లు సమాచారం.
సినిమాను తెరకెక్కించుతున్నట్లు సమాచారం..
బోయపాటి శ్రీను ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడని త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని కూడా మాస్ సినిమాలను చేయడానికి మక్కువ చూపుతున్నాడట. ఇప్పటికే లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న ది వారియర్ చిత్రంలో రామ్ పొతినేని మాస్ హీరోగా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం అనంతరం బోయపాటి సినిమా మొదలు కానున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.