Akhand 2 | బాలకృష్ణ ‘అఖండ’ సినిమాకు ఓ ప్రత్యేకతుంది. అదేంటంటే.. ఆ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఇలాంటి క్రెడిట్‌ని కొన్ని సినిమాలే దక్కించుకుంటాయి. అటువంటి సినిమాకు సీక్వెల్ వస్తున్నదంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2 – తాండవం’ కోసం బాలయ్య అభిమానులేకాక యావన్మంది ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకే స్క్రిప్ట్ దగ్గర్నుంచి చిత్రీకరణ వరకూ.. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. అటు బాలకృష్ణకు, ఇటు బోయపాటికి ఇది తొలి పాన్ఇండియా సినిమా కావడం విశేషం. అందుకే.. వివిధ భాషల నుంచి నటులను తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతున్నది. బాలయ్య నటిస్తున్న అఘోరా పాత్రపై కీలక సన్నివేశాలను బోయపాటి చిత్రీకరిస్తున్నారు. ఆది పినిశెట్టి కూడా షూటింగ్లో భాగమయ్యారు. ఆయన గెటప్ కూడా అఘోరాని తలపించేలా ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఓ యజ్ఞగుండం ముందు కూర్చొని ఆది పినిశెట్టి యాగం చేస్తున్న సన్నివేశాలు తీస్తున్నారట బోయపాటి. ఈ సన్నివేశం సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. బాలకృష్ణ పవర్‌ప్యాక్ పెర్ఫార్మెన్స్ని ఈ సన్నివేశం ఆవిష్కరిస్తుందని సమాచారం. సెప్టెంబర్ 28న పానిండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తమన్ సంగీత దర్శకుడు.