Box Office | ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు నెలకొనబోతోంది. జూన్ 19న ఒకేసారి ఆరు విభిన్న జానర్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్, లవ్ స్టోరీలతో తెరకెక్కిన ఈ చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’తో పాటు విజయ్ ఆంటోనీ, రష్మిక మందన్న, షాహిద్ కపూర్ వంటి ప్రముఖుల చిత్రాలు కూడా విడుదలవుతుండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ ఈ వారంలో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో ఒకటి. దర్శకురాలు నందినీ రెడ్డి రూపొందించిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ అంశాలకు కూడా పెద్దపీట వేశారు. ఇక విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘వంద దేవుళ్లు’ కూడా ఈ వారంలో విడుదల కానున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి. ‘బిచ్చగాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు శశితో కలిసి విజయ్ ఆంటోనీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. మరోవైపు చాలా కాలం తర్వాత ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు వడ్డే నవీన్ . రాశి సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం భావోద్వేగ కథాంశంతో తెరకెక్కింది. వడ్డే నవీన్‌ను మళ్లీ ప్రధాన పాత్రలో చూడబోతుండటంతో ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
‘మంజుమ్మెల్ బాయ్స్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చిదంబరం రూపొందించిన ‘బాలన్: ది బాయ్’ కూడా ఈ వారమే విడుదల కానుంది. తల్లి-కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామా మలయాళ సినిమాల అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకునే అవకాశం ఉంది.మరోవైపు హర్షిత్, స్నేహ మణిమేకలై జంటగా నటించిన ‘దీవానా’ చిన్న సినిమాగా వస్తున్నప్పటికీ మంచి బజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ విడుదల చేయడం విశేషం. ఇక బాలీవుడ్ నుంచి వస్తున్న అర్బన్ రొమాంటిక్ డ్రామా ‘కాక్టెయిల్ 2’ కూడా జూన్ 19న విడుదల కానుంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని హోమి అడజానియా తెరకెక్కించారు. ఒకే రోజు ఆరు సినిమాలు విడుదలవుతుండటంతో ఈసారి బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఆరు చిత్రాల్లో ఏది ప్రేక్షకుల మనసు గెలిచి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలుస్తుందో తెలుసుకోవాలంటే జూన్ 19 వరకు వేచి చూడాల్సిందే.