Kareena Kapoor | ప్రయాణాల్ని ప్రేమించే సినీతారల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా ముందు ఉంటుంది. విహార యాత్రల్లో భాగంగా ఆమె విభిన్న ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటుంది. వాటిలో తనకేం ఇష్టం, ప్రయాణ సమయంలో ఎలాంటి డైట్ ఇష్టపడుతుంది, ఇంకా ఏమేం చూడాలనుకుంటున్నది.. రకరకాల సంగతుల్ని చెప్పుకొచ్చిందిలా..
నాకు ప్రయాణాలంటే ఇష్టం కాబట్టి, మీ ఫేవరెట్ డెస్టినేషన్ ఏంటి? అని అడుగుతుంటారు. నాకు, సైఫ్‌కు స్విట్జర్లాండ్ చాలా ఇష్టం. మేమిద్దరమే అయితే అక్కడికే వెళతాం. అదే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి
వెళ్లాలంటే బీచ్‌లు ఇష్టం. అక్కడైతే నీళ్లతో ఆడుతూ సరదాగా గడపొచ్చు. షాపింగ్ కోసం వెళ్లాలనుకుంటే దుబాయ్, న్యూయార్క్ ఎంచుకుంటా. మొత్తానికి నాకిష్టమైన ప్రదేశం అన్నది నేను వెళుతున్న సందర్భాన్ని బట్టి ఉంటుందన్న మాట!
ఇండియాలో అయితే లద్దాక్, రాజస్థాన్ బాగా నచ్చుతాయి. నేను షూటింగ్ కోసం లద్దాక్ చాలాసార్లు వెళ్లాను. వెళ్లిన ప్రతిసారీ మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాజస్థానీ రుచులు వారెవ్వా అనిపిస్తాయి. చుట్టూ కనిపించే నిండైన రంగులు పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి.
ఇక, ఎయిర్పోర్ట్ లుక్ గురించి చెప్పాలంటే.. ప్రయాణాల్లోనూ అందంగా ఎలా కనిపిస్తారని నన్ను అడుగుతుంటారు. జర్నీకి ముందు, తర్వాత కూడా నేను చక్కగా నిద్రపోతా. మొదట్లో జెట్లాగ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కూడా అలా అనిపిస్తే బాగా నిద్రపోతా, నీళ్లు తాగుతా. మజిలీ చేరగానే ముందు నేను చేసే పని, ప్రశాంతంగా గ్రీన్ టీ తాగడం. అది ప్రయాణ బడలికను పోగొడుతుంది.
నాకు విదేశీ రుచుల కంటే ఇంటి భోజనమే ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ఇటాలియన్ వంటకాలతో పాటు రెడ్‌వైన్ నా ఫేవరెట్లుగా ఉంటాయి. బయట రిస్క్ ఎందుకులే అనిపించినప్పుడు మాత్రం శాకాహారం తింటాను.
మనం నిజమైన పాఠాలను పుస్తకాల నుంచి కంటే బయటి ప్రపంచం నుంచే నేర్చుకుంటాం. ఎన్నో ప్రదేశాలు తిరిగా. ఇన్నాళ్లలో ఒక విదేశీ భాషో, ఒక సాహస క్రీడో, పోనీ ఫొటోగ్రఫీనో.. నేర్చుకుని ఉంటే బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
నేను వెళ్లాలనుకుంటున్న ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ముందుగా.. చైనా, మచుపిచ్చు చూడాలనుంది. అంటార్కిటికా సాహసయాత్ర చేయాలి. మనదేశంలో ఈశాన్య రాష్ర్టాలు.. ముఖ్యంగా మేఘాలయ వెళ్లాలి. అక్కడి టీ తోటల అందాలను ఆస్వాదించాలి.