షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘జవాన్’ విడుదల వాయిదా పడనుందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ సినిమా వాస్తవానికి జూన్ 2న విడుదల కావాల్సి ఉంది. ఆ తేదీని అదే నెల 29కి మార్చారు. అయితే ఈ తేదీన కూడా సినిమా తెరపైకి రావడం లేదని తెలుస్తున్నది. తాజా సమాచారం ప్రకారం షారుఖ్ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
వీఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యమే సినిమా విడుదల వాయిదాకు కారణంగా చెబుతున్నారు. మరింత నాణ్యమైన గ్రాఫిక్స్ పనుల కోసం ఇంకాస్త సమయం కేటాయించాలని చిత్ర దర్శకుడు అట్లీ భావిస్తున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార నాయికగా నటిస్తున్నది. దీపికా పడుకోన్ అతిథిగా మెరవనుంది. ఇటీవలే ఈ సినిమా రెండు పాటల చిత్రీకరణతో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.