Khushi Kapoor | సోషల్ మీడియాలో కనిపించే 10 సెకండ్ల రీల్స్ చూసి ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొద్దనీ, ఆ పది సెకండ్లలో ఒక వ్యక్తి గురించి ఏమీ అర్థం చేసుకోలేమనీ అంటున్నది ఖుషీ కపూర్. తన తాజా చిత్రం ‘లవ్ యాపా’ ప్రమోషన్లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది ఖుషీ. ఇన్‌స్టా రీల్స్, ఏఐ, కుటుంబ బంధాలు.. ఇలా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నది. కొంతమంది 10 సెకండ్ల రీల్స్ చూసి ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారనీ, ఆ పది క్షణాల్లో ఒక వ్యక్తి గురించి ఏం అర్థం చేసుకుంటారనీ ప్రశ్నించింది. ‘రీల్స్‌లో కనిపించే వారి నిజ జీవితం గురించి ఏం తెలుసు? కనీసం వాళ్లు ఏం చేస్తారనే ఆలోచన కూడా ఉండదు. అలాంటప్పుడు.. వారి గురించి ఓ అభిప్రాయానికి ఎలా వస్తారు? అవతలి వారు ఎలాంటివారైనా.. ఒకరినొకరు గౌరవించుకోవాలి.
రీల్స్ చూసి మనుషులను అంచనా వేయకండి. నెగెటివ్ కామెంట్స్ చేయకండి. లేదంటే.. మంచివారిని బాధపెట్టిన వాళ్లమవుతాం!’ అని చెప్పుకొచ్చింది. ఇక సాంకేతికత అభివృద్ధిపై అభిప్రాయాలు పంచుకుంటూ.. ఏఐతో ఇంటర్నెట్లో భయంకరమైన విషయాలు చూస్తున్నామనీ, దీని గురించి అందరూ అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇచ్చింది.
‘నిజజీవితంలో కమ్యూనికేషన్ అనేది ఎంతో ముఖ్యం. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని విషయాల గురించి కుటుంబసభ్యులు, స్నేహితులతో తప్పకుండా చర్చించాలి. అప్పుడే బంధాలు బలపడతాయి’ అంటూ బంధాల గొప్పదనాన్ని వెల్లడించింది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా తెరంగేట్రం చేసింది ఖుషీ. మొదటి సినిమా ‘ది ఆర్చీస్’తోనే.. తానేంటో నిరూపించుకున్నది. ఆ తర్వాత ‘లవ్ టుడే’ రీమేక్‌తో బీటౌన్‌ను మెప్పించింది. తక్కువ సినిమాలే చేసినా.. మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఖుషీకి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.