బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ గాయాలపాలయ్యారట. ప్రస్తుతం ఈ వార్త బీటౌన్‌లో ఓ స్థాయిలో హల్చల్ చేస్తున్నది. ప్రస్తుతం ఆయన ‘కింగ్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో షారుఖ్ గాయపడ్డట్టు సమాచారం. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా నటిస్తుండగా ఆయన గాయాలపాలయ్యారట. గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
అత్యవసర చికిత్స నిమిత్తం షారుక్ అమెరికా వెళ్లినట్టు వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో షారుఖ్‌కు తగిలిన గాయం తీవ్రమైనది కాదని, అది కేవలం కండరాల గాయం మాత్రమేనని చిత్ర వర్గాలు తెలియజేశాయి. ఈ కారణం వల్ల ‘కింగ్’ షూటింగ్ సెప్టెంబర్‌కు వాయిదా వేశారట. షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె తల్లిగా రాణీ ముఖర్జీ కనిపించనున్నారట. ఈ యాక్షన్ ఎంటైర్టెనర్కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు.