బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఫిట్‌నెస్‌కు నిర్వచనంగా కనిపిస్తాడు. కండలు తిరిగిన దేహం ఆయన సొంతం. ఎడతెరపి లేకుండా ఎక్సర్సైజులు చేసి మరీ ఈ రూపాన్ని సంపాదించుకున్నాడు. ఏండ్లుగా కష్టపడి పోషించిన శరీరాన్ని కాపాడుకోవడం కత్తి మీద సామే! జిహ్వ చాపల్యాన్ని చంపుకొంటేనే గానీ, పెరిగిన కండలు కరగకుండా ఉంటాయి. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు రణ్వీర్. చాకు లాంటి ఈ హీరో తాజాగా ప్లేటు నిండా ఫ్రైస్‌తో కనిపించాడు. ఓ ఫుడ్‌కోర్టుకు వెళ్లి మరీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాడు.
అవన్నీ తనకే అన్నట్టుగా ఫొటో దిగి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. అహరహం ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటించే రణ్వీర్ ఇలా ఫ్రైస్ తినడానికి సిద్ధమవ్వడమేంటని ఆశ్చర్యపోకండి. సినిమా కోసం శరీరాన్ని కష్టపెట్టుకునే ఈ హీరో.. తన అప్‌కమింగ్ ప్రాజెక్టు కోసం డైట్ ప్లాన్‌ను పక్కన పెట్టేశాడట. రాబోయే సినిమాలో పాత్ర కాస్త నిండుగా కనిపించాలని ఏకంగా పదిహేను కిలోలు పెరగడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట రణ్వీర్. అందుకోసమే ఇదిగో ఇలా.. కొన్నాళ్లు రుచులు ఆస్వాదించడానికి సిద్ధపడ్డాడు. ఇన్‌స్టాలో ఈ హీరో పోస్ట్ చూసి ఆయన అభిమానులు ఇదంతా ‘డాన్ 3’ సినిమా కోసమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.