పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రా అరెస్ట్.. బయటకొస్తున్న బాలీవుడ్ కనెక్షన్స్
అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించిన కేసులో వ్యాపారవేత్త, సీనియర్ కథానాయిక శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేయడం బాలీవుడ్లో కలకలం సృష్టించింది. నీలి చిత్రాల నిర్మాణంతో పాటు వాటిని పలు ఓటీటీ యాప్స్‌లోకి అప్లోడ్ చేస్తున్నారనే ఆరోపణలతో రాజ్‌కుంద్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్ట విరుద్ధమైన నీలి చిత్రాల నిర్మాణం ద్వారా రాజ్ కుంద్రా భారీ మొత్తంలో డబ్బును ఆర్జించారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, తదుపరి విచారణ కొనసాగుతున్నదని ముంబయి పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే తెలిపారు.
అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఫిబ్రవరి 4వ తేదీన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వెబ్‌సిరీస్‌లలో అవకాశాలు పేరుతో ముంబయికి యువతుల్ని రప్పించి వారిని నీలి చిత్రాల్లో నటించేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. ముంబయిలోని వెస్ట్ మలాడ్‌లో ఉన్న మాద్ ఏరియాలోని ఓ బిల్డింగ్‌లో ఈ పోర్న్ సినిమాల చిత్రీకరణ జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు తమ దర్యాప్తులో రాజ్‌కుంద్రాను ప్రధాన సూత్రధారిగా నిర్ధ్దారించారు.
కెన్రిన్ సంస్థ ద్వారా
రాజ్‌కుంద్రా అరెస్ట్‌లో వాట్సాప్ చాట్ కీలక సాక్ష్యంగా నిలిచింది. యూకేలో నివసిస్తున్న రాజ్ కుంద్రా బంధువు ప్రదీప్ బక్షీ కెన్రిన్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో రాజ్‌కుంద్రా భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఈ కెన్రిన్ సంస్థ పోర్నోగ్రఫీ కంటెంట్ మేకింగ్ కోసం అనేక మంది ఏజెంట్స్‌కు అడ్వాన్స్‌ల రూపంలో డబ్బులు అందజేస్తున్నట్లు తెలిసింది. ఏజెంట్స్ తాము తీసిన వీడియోలను కెన్రిన్ సంస్థ సూచించిన మెయిల్ ఐడీకి పంపిస్తూ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మోడల్-నటి గెహనా విశిష్ట్ కెన్రిన్ ప్రొడక్షన్స్ ప్రోద్భలంతోనే ఈ నీలి చిత్రాల నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. కెన్రిన్ సంస్థకు ఇండియా ప్రతినిధిగా రాజ్‌కుంద్రా మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఉమేష్ కామత్ వ్యవహరిస్తున్నారు. ఏజెంట్స్ తీసిన నిలీ చిత్రాలను యాప్, ఓటీటీలలో అప్లోడ్ చేస్తూ రాజ్‌కుంద్రా, ప్రదీప్ బక్షీ భారీగా డబ్బులు సంపాదించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్స్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోర్న్ సినిమాల ద్వారా వారు ఎంత మొత్తాలు సంపాదిస్తున్నారనే విషయాలు ఈ చాట్‌లో తేటతెల్లమయ్యాయి. పోర్నోగ్రఫీ ఇండియాలో చట్ట వ్యతిరేకం కావడంతో ఈ వీడియోలను కుంద్రా తన ఆఫీస్ నుంచే విదేశాలకు వీ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించి అక్కడి యాప్‌లలో అప్లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో తన్వీర్ హష్మీ అనే డైరెక్టర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఔత్సాహిక కథానాయికల్ని బలవంతంగా పోర్న్ సినిమాల్లో నటించేలా అతడు ప్రోత్సహిస్తున్నట్లు విచారణలో తేలింది. వెబ్‌సిరీస్ పేరుతో వీరు పోర్న్ సినిమాలను తీస్తున్నారని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలీవుడ్ ఓ మురికి కూపం
బాలీవుడ్‌ను మురికికూపంగా పిలవడానికి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలే కారణమంటూ రాజ్ కుంద్రా అరెస్ట్‌ను ఉద్దేశించి నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. మెరిసేవన్నీ బంగారం కాదని, బుల్లీవుడ్లోని చీకటి కోణాలను తాను రూపొందించబోతున్న ‘టీకు వెడ్స్ షేరు’ సినిమాలో కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించబోతున్నట్లు కంగనా పేర్కొన్నది.
పోర్న్ వర్సెస్ వ్యభిచారం
రాజ్‌కుంద్రాతో పాటు అతడి భాగస్వాములు పోర్నోగ్రఫీ చిత్రాల ద్వారా నెలకు అరవై లక్షలకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని పోలీసులు తెలిపారు. పోర్న్ వీడియోలను హాట్‌షాట్స్ అనే యాప్ ద్వారా అప్లోడ్ చేసేవారు. ఈ యాప్‌ను రాజ్‌కుంద్రాకు చెందిన ఆర్మ్స్ ప్రైమ్ కంపెనీ డెవలప్ చేసింది. అయితే ఈ యాప్‌ను తానెప్పుడో ప్రదీప్బక్షీకి విక్రయించానని రాజ్‌కుంద్రా చెబుతున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం కుంద్రా ఫోన్‌తో పాటు అతడి బిల్డింగ్‌ను పోలీసులు సీజ్ చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్) 292 (అశ్లీల చిత్రాల మేకింగ్), 3, 4 (కామన్ ఇంటెన్షన్), 67, 67 ఏ( మహిళల్ని అసభ్యంగా చిత్రించడం) కేసులను నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా శిల్పాశెట్టికి కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నెల 23 వరకు రాజ్‌కుంద్రాకు కోర్ట్ రిమాండ్ విధించింది. ఈ కేసుతో బాలీవుడ్ కథానాయికలు పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు సంబంధం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. రాజ్‌కుంద్రా ద్వారానే వీరు పోర్న్ సినిమాల్లో నటించినట్లు సమాచారం. అయితే రెండేళ్ల క్రితం తన అనుమతి లేకుండా ఫొటోలను అసభ్యంగా యాప్‌లలో ఉపయోగించమే కాకుండా తన వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేశాడని రాజ్‌కుంద్రాపై పూనమ్‌పాండే కేసు పెట్టింది. గతంలో వెబ్‌సిరీస్‌లో అవకాశం పేరుతో న్యూడ్ ఆడిషన్ ఇవ్వాలని రాజ్‌కుంద్రా డిమాండ్ చేసినట్లు నటి సాగరిక షోనా ఆరోపించింది. 2012 సమయంలో పోర్న్ వర్సెస్ వ్యభిచారం పేరుతో రాజ్‌కుంద్రా చేసిన ఓ ట్వీట్ ఈ కేసు కారణంగా వైరల్‌గా మారింది. ‘కెమెరా ముందు శృంగారంలో పాల్గొంటే డబ్బులు ఇవ్వడంలో తప్పేముంది. దీనికంటే వ్యభిచారం ఏ రకంగా భిన్నమైంది?’ అంటూ అప్పట్లో ఈ ట్వీట్లో రాజ్‌కుంద్రా పేర్కొన్నారు. అయితే ఈ కేసులో రాజ్‌కుంద్రా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.