బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపిక పదుకొణె ఇంట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. కూతురు దువాసింగ్ వచ్చినప్పటి నుంచి తమ ఇంట సంతోషాలు అనంతంగా కొనసాగుతున్నాయని రణ్వీర్ పేర్కొన్నాడు. గత సెప్టెంబర్‌లో దువాసింగ్ జన్మించింది. కూతురుతో ఫస్ట్ ట్రిప్ వెళ్లొచ్చిన ఈ జంట నూతనోత్సాహంతో కనిపిస్తున్నది. కూతురు పుట్టిన్నప్పటి నుంచి పితృత్వపు సెలవుల్లో ఉన్న రణ్వీర్ దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు.
ఈ సందర్భంగా తండ్రిగా తనకు కలుగుతున్న ఫీలింగ్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ‘నా చిట్టితల్లి వచ్చాక మా జీవితం ఇంత అందంగా, ఆనందంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. దువాతో గడుపుతున్న క్షణాలు నా జీవితంలోనే అత్యంత విలువైనవి. డాడీ డ్యూటీ సూపర్‌గా ఉంది. నా కూతురు కండ్లలోకి చూస్తూ రోజులకు రోజులు గడిపేస్తున్నా! మీ అందరితో విడిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ తనదైన శైలిలో పుత్రికోత్సాహాన్ని పంచుకున్నాడు రణ్వీర్. ఇక ఇటీవల రణ్వీర్, దీపికా కలిసి నటించిన మల్టీస్టారర్ ‘సింగం 3’ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక చిత్రం ‘డాన్ 3’ షూటింగ్ కోసం రణ్వీర్ సిద్ధమవుతున్నాడు. సెట్స్ మీదున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. డాన్, డాన్ 2లో షారుక్ ఖాన్ పోషించిన పాత్రలో రణ్వీర్ కనిపించనున్నాడు. అతనికి జోడీగా కియారా అద్వాణీ నటించనుంది.