కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే. అందుకని అత్యాశకు పోయి ఉన్నదాన్ని వదులుకుంటే కష్టాలు తప్పవు. ఈ విషయంలో కొందరు కీడెంచి మేలెంచుతారు. కొందరు తెగించి సాధిస్తారు. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఇందులో రెండో రకం. ఆమె కాలేజ్‌లో చదువుకుంటున్న సమయంలోనే టీవీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. ‘ముజ్సే కుచ్ కెహతీ.. యే ఖామోషియాన్’, ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్స్‌తో బుల్లితెర వీక్షకులకు బాగా చేరువైంది. ఆమె పాత్రలు జనానికి నచ్చడంతో నిర్మాతలు పారితోషికాన్ని కూడా పెంచారు.
ఆదాయం భారీగానే వచ్చింది. ఇంతలోనే టీవీ రంగానికి స్వస్తి పలికి వెండితెర వైపు మళ్లింది మృణాల్. ఈ సాహసోపేత నిర్ణయం గురించి ఆమె మాట్లాడుతూ ‘సొంతవాళ్లంతా వద్దని వారించినా, నేను మాత్రం మొండిగా సీరియల్స్‌ని వదిలేసి సినిమాల్లోకి వచ్చాను. మరాఠీ చిత్రం ‘హలో నందన్’తో నా సినీ కెరీర్ మొదలైంది. నిజానికి సీరియల్స్ చేస్తున్నప్పుడే డబ్బులు బాగా వచ్చాయి. సినిమాల్లోకి వచ్చాక ఆదాయం తగ్గింది. ఓవైపు బాధ్యతలు, మరోవైపు అప్పులు. నిజంగా భయపడ్డాను. అలాంటి టైమ్‌లో ‘లవ్ సోనియా’ చిత్రం కెరీర్‌ని మొత్తం మార్చింది. హృతిక్‌తో చేసిన ‘సూపర్ 30’, జాన్ అబ్రహంతో చేసిన ‘బాట్లా హౌస్’ చిత్రాలు బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చాయి. డబ్బు గురించే ఆలోచిస్తే ఈ రోజున నాకు ఈ స్థాయి దక్కేది కాదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు డబ్బు కూడా ఎక్కువే సంపాదిస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది మృణాల్ ఠాకూర్.