90ల నాటి ప్రేమలే ఎంతో గొప్పవనీ, వాటినే తాను బలంగా నమ్ముతానని అంటున్నది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. నేటితరం ఫాలో అవుతున్న డేటింగ్ ట్రెండ్స్, ఆధునిక హుక్అప్ సంస్కృతికి తాను పూర్తిగా వ్యతిరేకమని చెబుతున్నది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నది. తాను కుటుంబానికి, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించింది. “నేను నా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నా. నా భాగస్వామి కూడా అలాగే ఉండాలని ఆశిస్తున్నా. అంతేకాదు.. అతని కుటుంబం కూడా నా కుటుంబంలాగే మారాలని కోరుకుంటున్నా!” అంటూ.. ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి చెప్పుకొచ్చింది.
పాతకాలం నాటి సాంప్రదాయ ప్రేమకథలంటే తనకు ఎంతో నమ్మకమనీ.. అదే తాజా సినిమాలో తాను పోషించిన రూమీ పాత్రకు తనను మరింత దగ్గర చేసిందనీ అంటున్నది. అనన్య మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు.. అనన్య పాండేపై వచ్చిన డేటింగ్ రూమర్స్‌ను గుర్తుచేస్తున్నారు. ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్, ఆదిత్యరాయ్ కపూర్ వంటి స్టార్లతో డేటింగ్ ముచ్చట్ల గురించీ చెప్పాలని కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య.. హిందీ పరిశ్రమలో అత్యంత పాపులర్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నది. తన గ్లామర్, స్టయిల్, ఫ్యాషన్ స్టేట్మెంట్స్తో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నది.