ప్రతిభే కాదు.. ప్రవర్తన కూడా మనిషిని గొప్పస్థాయికి చేరుస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనం సాయిపల్లవి. వచ్చిన పాత్రలన్నీ ఒప్పుకోదు. నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తుంది. అశ్లీలతకు ఆమడదూరంలో ఉంటుంది. కరెన్సీ కంటే క్యారెక్టర్‌కే ఎక్కువ విలువ ఇస్తుంది. అందుకే తనను మించిన అందగత్తెలు బాలీవుడ్లో ఎందరున్నా.. మహాసాద్వి సీత పాత్ర వెతుక్కుంటూ సాయిపల్లవిని వరించింది. గొప్ప గొప్ప సినీపెద్దలు సైతం కేవలం ప్రవర్తన కారణంగా సాయిపల్లవికి అభిమానులయ్యారంటే అతిశయోక్తి కాదు.
రీసెంట్గా ఆమె గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరైంది. ఆ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయిపల్లవితో ఫొటోలు దిగేందుకు చాలామంది ప్రయత్నించారు. బాలీవుడ్ లెజెండ్ అనుపమ్‌ఖేర్ సైతం ఆమెతో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. అంతేకాదు, దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన.. ‘సాయిపల్లవిని కలవడం సంతోషంగా ఉంది.
చిన్న సమావేశంలోనే ఆమెలో స్వచ్ఛమైన నిజాయితీని, మర్యాదనూ చూశా. నటిగా గొప్ప స్థాయికి ఆమె చేరనుంది. దానికి ముందుగా నా శుభాకాంక్షలు.’ అంటూ పేర్కొన్నారు. సాయిపల్లవి గురించి అంతటి లెజెండ్ ఈ స్థాయిలో స్పందించడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.