Raveena Tandon | ఒకప్పుడు రవీనా టాండన్, అక్షయ్ కుమార్‌ది బాలీవుడ్లో హిట్‌పెయిర్. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. రీల్ లైఫ్‌లో పాపులర్ అయిన ఈ జంట రియల్ లైఫ్‌లో కూడా సూపర్ జోడీ అనిపించుకోవాలని అనుకున్నారు. గాఢంగా ప్రేమించుకున్న తర్వాత పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్లిద్దరూ విడిపోయారు. దానిపై ఇప్పటివరకు ఎవరూ నోరుమెదపలేదు. అయితే దాదాపు పాతికేళ్ల తర్వాత అక్షయ్ కుమార్‌తో బ్రేకప్‌పై రవీనా టాండన్ స్పందించింది. అక్షయ్ కుమార్‌తో పెళ్లి క్యాన్సిల్ అయిన క్షణాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.
‘ బ్రేకప్ తర్వాత నేను, అక్షయ్ చెరో దారి చూసుకున్నాం. నేను ఒకరితో డేటింగ్ చేశా.. అతను మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరం ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుని సెటిలయ్యాం. అలాంటప్పుడు మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకొస్తుంది? అప్పటికీ ఇప్పటికీ మేం హిట్ పెయిర్‌నే. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కలుసుకుంటాం.’ అని చెప్పుకొచ్చింది.
1994లో వచ్చిన మోహ్రా సినిమా హిట్ కావడంతో తమ జోడీకి మంచి ప్రశంసలు దక్కాయని తెలిపింది. ఆ సినిమా తర్వాత ఇద్దరం రిలేషన్లోకి రావడం.. ఎంగేజ్మెంట్ జరగడం.. ఆ వెంటనే బ్రేకప్ అయిపోయిందని చెప్పింది. అయితే అది ఎప్పుడు జరిగిందనేది సరిగ్గా గుర్తులేదు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం ఇప్పటికీ తన మనసులో ఉండిపోయాయని చెప్పుకొచ్చింది. బ్రేకప్ తర్వాత కొంతకాలం పాటు పేపర్లు చదవడం కూడా మానేశానని తెలిపింది.