SSMB 29 | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా జోనాస్, కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నానా పటేకర్‌ని సంప్రదించగా.. ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు రూ. 20 కోట్ల పారితోషికాన్ని 15 రోజుల షూటింగ్ కోసం ఆఫర్ చేసినప్పటికీ, నానా పటేకర్ ఈ పాత్రకు నో చెప్పినట్లు సమాచారం.
బాలీవుడ్ నివేదికల ప్రకారం, రాజమౌళి స్వయంగా పూణేలోని నానా పటేకర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి స్క్రిప్ట్‌ను వివరించినట్లు తెలుస్తోంది. రాజమౌళి కథ చెప్పిన విధానం, ప్రాజెక్ట్‌పై ఆయనకున్న అంకితభావం పట్ల నానా పటేకర్ ప్రశంసలు కురిపించినప్పటికీ, ఆ పాత్ర తనకు ఆకర్షణీయంగా అనిపించలేదని, తాను కోరుకునే లోతు ఆ పాత్రలో లేదని ఆయన భావించినట్లు వార్తలు చెబుతున్నాయి. ఈ వార్తలపై నానా పటేకర్ నేరుగా స్పందిస్తూ, తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తులో రాజమౌళితో కలిసి పనిచేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ‘SSMB29’ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.