ప్రేక్షకహృదయాల్లో స్థానాన్ని సంపాదించేందుకు నటీనటులు పడే కష్టం సామాన్యమైనది కాదు. ఓ సినిమా షూటింగ్ టైమ్లో తనకు జరిగిన ఓ ప్రమాదం గురించి నటుడు బాబీడియోల్ రీసెంట్గా గుర్తు చేసుకున్నారు. తాను మరిచిపోదామన్నా తన కాలిలో ఉన్న ఇనుపరాడ్లు అవి మర్చిపోనివ్వవనీ, ఇప్పటికీ అవి తన కాలిలో అలాగే ఉన్నాయనీ సన్నీ అన్నారు. ఆ రోజు నా అన్న సన్నీడియోల్ నా దగ్గర లేకపోతే నా కాలు తిరిగి వచ్చేది కాదని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ‘నాకు ఇంకా గుర్తు.
అది నా తొలి సినిమా ‘బర్సాత్’ షూటింగ్. ఇంగ్లాండ్లో జరిగింది. గుర్రంపై వేగంగా వెళ్లే సీన్స్ తీస్తున్నారు. సరిగ్గా అప్పుడే మరో గుర్రం సడెన్గా ఎదురొచ్చింది. దాంతో బలంగా ఢీకొని కింద పడిపోయాను. నా కాలు విరిగిపోయింది. నిలబడలేక కుప్పకూలిపోయాను. నా అదృష్టం కొద్దీ అన్నయ్య సన్నీడియోల్ అక్కడే ఉన్నాడు. నన్ను భుజాలపై మోస్తూ ఆసుపత్రికి పరిగెత్తాడు.
వైద్యులు కాలు ఇక రాదని చెప్పేశారు. ప్రారంభంలోనే కెరీర్ ముగిసిపోయిందని కృంగిపోయాను. కానీ అన్నయ్యకు గట్టి నమ్మకం నా కాలు వస్తుందని. వెంటనే ఆ రాత్రే నన్ను లండన్లోని మరో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాడు. శస్త్రచికిత్స జరిగింది. నా కాలు మళ్లీ నాకొచ్చింది. అది జరిగి ఇప్పటికి 30ఏళ్లు. ఇంకా ఆ రాడ్లు నా కాలిలో అలాగే ఉన్నాయి. కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ అలవాటు పడిపోయా. అందరిలా నడవగలను, పరుగెత్తగలను, డాన్స్ చేయగలను, దూకగలను.. ఇంకేం కావాలి..’ అంటూ నవ్వేశారు బాబీడియోల్.