Chiranjeevi | తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలపైనే దృష్టి సారించిన చిరంజీవిని బీజేపీ కీలక నేత కలవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే అంశంపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక సంస్కరణలను వివిధ రంగాల ప్రముఖులకు వివరించే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే రామచందర్ రావు చిరంజీవిని కలిసి మోదీ ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలు, ప్రచార పత్రాలను అందజేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, సామాజిక రంగాల్లో జరిగిన మార్పులపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
అధికారికంగా ఇది మర్యాదపూర్వక భేటీగా చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం పలు విశ్లేషణలు కొనసాగుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చిరంజీవి, అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీ అయిన ఆయన మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా బీజేపీతో ఆయన సాన్నిహిత్యం పెరుగుతుందా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. చిరంజీవి తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్‌కు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో చిరంజీవి-బీజేపీ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందా? లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు సంకేతమా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
చిరంజీవిని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
ప్రధాన మంత్రి నరేంద్ర 12 ఏళ్ల
పాలన సందర్భంగా ‘విశేష్ జన్ సంపర్క్ అభియాన్’ప్రత్యేక ప్రజా సంపర్క భాగంగా కలిసిన రామచందర్ రావు
గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన కీలక విజయాలు, మైలురాళ్లు విప్లవాత్మక… pic.twitter.com/73FLj4czi8
— BJP Telangana (@BJP4Telangana) June 22, 2026