Ram Charan|మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలు సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తనయుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వస్తున్నాడంటే అభిమానుల అంచనాలు ఎలా ఉంటాయి. ఏ మాత్రం తేడా కొట్టిన కెరియర్ గల్లంతే. అదే సమయంలో మాస్ డైరెక్టర్‌గా తిరుగులేని స్టార్డంతో ఉన్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు రామ్ చరణ్. ఇందులో రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి కావల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, పంచ్ డైలాగ్స్ , యాక్షన్ సీక్వెన్సులు ఇలా అన్నింటితో మెగా ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేశాడు. చిరుత సినిమా చూసి అసలు ఇది చరణ్ తొలి సినిమానేనా అని అందరు అనుకున్నారు. చిరుతతో తొలి హిట్ కొట్టిన రామ్ చరణ్ ఆ తర్వాత . తన హార్స్ రైడింగ్ పవర్ చూపించి మగధీరతో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు.
మగధీర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి రామ్ చరణ్‌ను తిరుగులేని స్టార్‌గా నిలబెట్టేసింది. రాజమౌళితో సినిమా చేస్తే ఆ సినిమా హిట్ అవుతుంది. కాని తర్వాతి చిత్రం ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. చరణ్ విషయంలో కూడా ఇది ప్రూవ్ అయింది. మగధీర తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన ఆరెంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓడిపోయింది. ఇందులోని పాటలు, రామ్ చరణ్ క్యాస్టూమ్, స్టైలింగ్ అంతా బాగుంటుంది. కాని ఎందుకో అప్పుడు జనాలకి ఎక్కలేదు. అయితే మూడు సార్లు ఆ మూవీని రీరిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన రచ్చ, నాయక్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు, బ్రూస్ లీ వంటి చిత్రాలు రామ్ చరణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేశాయి.
ఆ సమయంలో ధృవ అనే సినిమా చేశాడు. ఇందులో మోస్ట్ స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టాడు. ఇక అప్పటి వరకు రామ్ చరణ్ నటనపై విమర్శలు చేసిన వారు రంగస్థలం సినిమా చూసి తండ్రిని మించిన తనయుడు అని కామెంట్ చేశారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు పాత్రలో కూడా నట విశ్వరూపం చూపించాడు చరణ్. అతని నటనకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు చరణ్. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ఆయన్ని మించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. చివరిగా గేమ్ ఛేంజర్‌తో డీలా పడ్డ చెర్రీ .. బుచ్చిబాబు, సుకుమార్‌లతో తర్వాతి సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బుచ్చిబాబు ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ రాబోతోంది.దాని కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.