శ్రీలంక క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ‘800’ పేరుతో వెండితెర దృశ్యమానం కానుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంతో పాపులర్ అయిన మధూర్ మిట్టల్ స్పిన్ మాంత్రికుడి పాత్రను పోషిస్తున్నారు. ఎం.ఎస్. శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
సుదీర్ఘ కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఏకైక ఆఫ్ స్పిన్నర్‌గా మురళీధరన్ రికార్డు సృష్టించారు. అందుకే ఈ సినిమాకు ‘800’ టైటిల్ పెట్టామని దర్శకుడు ఎం.ఎస్.శ్రీపతి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘మురళీధరన్ క్రికెట్ ప్రయాణం చుట్టూ అల్లుకున్న కథ మాత్రమే కాదిది. ఓ సాధారణ యువకుడి ధైర్యసాహసాలకు, అసమానతలకు ఎదురొడ్డి గెలిచిన సంకల్పబలానికి నిదర్శనంగా ఉంటుంది. క్రికెట్ గురించి ఏమీ తెలియనివారికి కూడా ఉత్కంఠకు గురిచేస్తుంది’ అన్నారు. తొలుత ఈ బయోపిక్‌ను విజయ్ సేతుపతితో తీస్తున్నట్లు ప్రకటించారు. ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. అయితే తమిళనాట వ్యతిరేకత రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తమిళ మూలాలు కలిగిన మురళీధరన్ శ్రీలంకలో పుట్టిపెరిగారు. జాఫ్నా కేంద్రంగా నడిచిన తమిళ వేర్పాటువాద ఉద్యమానికి మురళీధరన్ వ్యతిరేకంగా ఉన్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారు.