Biopic | సెన్సేషనల్ హిట్ ‘ఛావా’ తర్వాత దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఆయన దృష్టి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఫోక్ డాన్సర్ వితాబాయి భౌ మాంగ్ నారాయణంగావ్కర్ జీవిత చరిత్రపై ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం అందుతోంది. వితాబాయి పాత్రకు శ్రద్దా కపూర్‌ని ఎంపిక చేశారు. ‘స్త్రీ 2’తో సూపర్ హిట్‌ను అందుకున్న శ్రద్దా కపూర్ ఇప్పుడు ఈ బయోపిక్ కోసం డాన్స్, సంగీతం, బయోపిక్ నేపథ్యంలో వర్క్ షాప్ చేస్తున్నారని సమాచారం.
వితాబాయి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, పురుషాధిక్య సమాజంలో ఆమె సాధించిన గౌరవం, కళపై చూపిన అంకిత భావం సినిమాకు ప్రధాన అంశాలు. కథలో ఒక ముఖ్య అంశం కూడా ఉంది. 9 నెలల గర్భవతిగా ఉన్నాకూడా ప్రదర్శనకు వెళ్లి స్టేజ్ వెనుక బిడ్డను ప్రసవించి వెంటనే ప్రదర్శన కొనసాగించడం అందరి మనసులు హత్తుకుపోయేలా చేసింది. ఈ సంఘటన వితాబాయి సంకల్పం, తన కళకు నిబద్ధతను చూపుతుంది.
లక్ష్మణ్ ఉటేకర్ మాట్లాడుతూ.. వితాబాయి గొప్పతనం, ఆమెకు కళ పట్ల ఉన్న గౌరవం చూస్తే చాలా ముచ్చటేసిందని, అందుకే ఆమె జీవిత గాథని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ముఖ్యమని భావిస్తున్నాం. వివాదాలు, సంక్లిష్టతలు ఉన్నా, ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మా లక్ష్యం అని అన్నారు. ఈ సినిమా త్వరలో అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంది. షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభమై, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం ఉంది. వితాబాయి బయోపిక్ ‘ఛావా’ రేంజ్లో తెరకెక్కి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచనుంది.