Bigg Boss | కన్నడ బిగ్ బాస్ సీజన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా, షో జరుగుతున్న జోలీవుడ్ స్టూడియోపై అధికారులు మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించలేదన్న కారణంతో బెంగళూరులోని బిడది ప్రాంతంలోని జోలీవుడ్ స్టూడియోను అధికారులు సీజ్ చేశారు. ఈ స్టూడియో నుంచి ప్రతిరోజూ 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు విడుదలవుతోందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీ చేసింది. అయితే నిర్వాహకులు ఈ నోటీసులను పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ తేజస్విని నేతృత్వంలో అధికారులు స్టూడియోకు తాళం వేశారు.
ఈ ఘటనతో బిగ్ బాస్ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇంట్లో ఉన్న 17 మంది కంటెస్టెంట్లను తాత్కాలికంగా ఈగిల్టన్ రిసార్ట్‌కి తరలించారు. ఈ పరిణామాలపై షో హోస్ట్ కిచ్చా సుదీప్ స్వయంగా జోక్యం చేసుకోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. జోలీవుడ్ స్టూడియోకి మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ డిప్యూటీ కమిషనర్ని ఆదేశించారు. జిల్లా మేజిస్ట్రేట్ జోలీవుడ్ స్టూడియోకు కాలుష్యానికి సంబంధించిన సమస్యలని సరిచేసేందుకు 10 రోజుల గడువు ఇచ్చారు. కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం, స్టూడియో సీజ్ చేయడమే తప్ప బిగ్ బాస్ షోతో ఎటువంటి సంబంధం లేదని కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత, బిగ్ బాస్ షో నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు.
బుధవారం తెల్లవారుజామున డిప్యూటీ కమిషనర్ యశ్వంత్ వి. గురుకర్ మరియు సౌత్ ఎస్పీ శ్రీనివాస్ గౌడ సమక్షంలో జోలీవుడ్ స్టూడియో గేట్‌ను తిరిగి తెరిచారు. కంటెస్టెంట్లను మళ్లీ బిగ్ బాస్ ఇంటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ షో నిర్వహణకు మాత్రమే అనుమతి ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్టూడియోలో ఇతర వాణిజ్య కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కిచ్చా సుదీప్, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఎలాంటి గందరగోళం లేకుండా సమస్యను పరిష్కరించి, షో కొనసాగేందుకు మార్గం సుగమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను,’’ అని పేర్కొన్నారు.