Bigg Boss | బిగ్ బాస్ ఫేమ్.. టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. యూట్యూబర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్, ఇందు వదన తదితర సినిమాల్లో రాయలసీమ స్లాంగ్‌లో మాట్లాడి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అలాగే బిగ్‌బాస్ 3వ, ఓటీటీ సీజన్లోనూ సందడి చేశాడు . ఫన్ బకెట్ వీడియోలతో పేరు తెచ్చుకున్న మహేష్ బిగ్ బాస్ సీజన్ 3తో పాటు ఓటీటీ కంటెస్టెంట్‌గా కూడా హౌస్‌లోకి వెళ్లి తెగ సందడి చేశాడు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే.. తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు మహేష్ విట్టా.
మహేష్ విట్టా.. పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్రావణి రెడ్డి.. ఆమె ఐటీ ఉద్యోగి. మహేష్ విట్టా చెల్లెలి ఫ్రెండే ఈ శ్రావణి రెడ్డి. తొలిచూపులోను చెల్లెలి ఫ్రెండ్‌పై మనసు పడ్డ మహేష్ విట్టా.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమెకు లవ్ ప్రోజ్ చేసి ఆ తర్వాత ఆమె మనసు గెలుచుకొని అనంతరం పెళ్లి చేసుకున్నాడు. శ్రావణి రెడ్డి ముందుగా అతడితో ఫ్రెండ్‌గా ఉండటానికే ఇష్టపడిందట. రెండేళ్ల తరువాత విట్టా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఆమె పేరుని మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా రివీల్ చేయడానికి ఆసక్తి చూపలేదు మహేష్. తాను ఐదేళ్ల పాటు ఆమెతో ప్రేమలో ఉన్నట్టు చెప్పాడు. తమ ప్రేమను పెద్దలు కూడా అంగీకరించినట్టు తెలియజేశాడు.
ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోన్న మహేష్ గుడ్ న్యూస్ అందించాడు. త్వరలో తాను తండ్రిగా కాబోతున్నట్టు తెలియజేస్తూ .. గర్భంతో ఉన్న తన భార్యతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహేష్. ‘ మా కథలోకి మరొకరు వస్తున్నారు. త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు మహేష్ విట్టా. ఈ క్రమంలో నెటిజన్స్, పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.