Bigg Boss Captain | బిగ్‌బాస్ హౌస్‌లో గత నాలుగు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యేకంగా ఎక్స్ కంటెస్టెంట్లను పిలిచి టాస్కులు నిర్వహించారు. వారిని ఓడించినవారే కంటెండర్లుగా ఎంపికయ్యారు. చివరకు కళ్యాణ్, డీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూ.. మొత్తం ఆరుగురు కంటెండర్లుగా నిలిచారు. ఇదిలా ఉండగా, తనూజ, భరణి, సుమన్ శెట్టి టాస్కుల్లో ఓడిపోయారు. చివరి కెప్టెన్‌ను నిర్ణయించే టాస్క్‌కి బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కంటెండర్లకు కాదు… కంటెండర్లు కాకపోయిన తనూజ, భరణి, సుమన్ శెట్టిలకే ఈ టాస్క్ ఇచ్చాడు. బజర్ మోగగానే ఈ ముగ్గురిలో ఎవరు ముందు కత్తిని తీసుకుంటే, వారు తాము కెప్టెన్‌గా చూడాలనుకునే కంటెండర్కు ఆ కత్తిని అందించాలి. కత్తిని అందుకున్న కంటెండర్ మాత్రం రేసులోని ఒకరిని ఎలిమినేట్ చేయాలి.
మొదట సుమన్ శెట్టి కత్తిని అందుకొని రీతూకి ఇచ్చాడు. రీతూ ఏకంగా సంజనను రేసులోంచి తొలగించింది. “గేమ్ గురించి మాట్లాడకుండా పర్సనల్ విషయాల్లోకి వెళ్లి నా క్యారెక్టర్‌ను తప్పుగా చూపించావ్” అని రీతూ కౌంటర్ ఇచ్చింది. దీనిపై సంజన కూడా స్పందిస్తూ, “ఇక్కడ ఎవరికీ పర్సనల్ అంటూ ఏమీ లేదు… ఇదంతా గేమ్ మాత్రమే” అని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అనంతరం భరణి కత్తిని డీమాన్‌కు అందించాడు. డీమాన్ వెంటనే ఇమ్మానుయేల్‌ను ఎలిమినేట్ చేశాడు. “నాకు అవసరం ఉన్నప్పుడు సాయం చేయలేదు” అంటూ ముందు నామినేషన్ కారణాన్నే టార్గెట్ చేశాడు. దీనిపై ఇమ్మానుయేల్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాంతో. ఇద్దరి మధ్య వాగ్వాదం కొద్ది సేపు కొనసాగింది.
ఒక్కొక్కరిని రేసు నుంచి తప్పిస్తూ చివరికి మిగిలింది కళ్యాణ్ మాత్రమే. దీంతో బిగ్‌బాస్ తెలుగు 9లో చివరి కెప్టెన్‌గా కళ్యాణ్ అధికారికంగా ఎంపికయ్యాడు. రెండోసారి ఆయన కెప్టెన్‌గా అవతరించడంతో హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ సీజన్ ముగియడానికి ఇంకా కేవలం మూడు వారాలే మిగిలి ఉన్నాయి. ఇంట్లో ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఎవరు బయటకు వెళ్లబోతున్నారో ఆసక్తిగా మారింది.