Bigg boss Agnipariksha | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నప్పటికీ, ఇప్పటికే హడావుడి మొదలైంది. ఈసారి షోకి కొత్త పంథాను ఎంచుకున్నారు నిర్వాహకులు . సామాన్య ప్రజలకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా “అగ్నిపరీక్ష” పేరుతో ఓ ప్రత్యేక మినీ షోను ప్రారంభించారు. డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ఆగస్టు 22 నుంచి ప్రతిరోజూ ప్రసారం అవుతున్న ఈ షోలో దాదాపు 45 మంది కామన్ మ్యాన్లు తమ ప్రతిభను, సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నారు. వీరిలో అత్యుత్తమంగా నిలిచే ఐదుగురిని బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంపిక చేయనున్నారు.
ఈ ప్రాసెస్ మొత్తం న్యాయంగా సాగేందుకు నటులు నవదీప్, బిందుమాధవి, అభిజిత్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. వారి సమీక్షలు, ప్రశ్నలు, సూచనలు ఈ షోను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. మరోవైపు ఈ షోలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు తమ బాధలు చెప్పుకుంటూ ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు. ఒక వ్యక్తి తన అక్కకు నయం కాని ఎస్ఎల్ఏ వ్యాధి ఉన్నదని చెప్పాడు. ఆమె కోసం ఎంతగానో కష్టపడుతున్నాడని, ఈ షో ద్వారా తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశిస్తున్నాడని చెప్పాడు. మరో యువకుడు తన అమ్మ కథ చెబుతూ అందరినీ ఎమోషనల్ చేశాడు. తండ్రి మృతిచెందిన తర్వాత, అమ్మే కుటుంబానికి అండగా నిలుస్తూ, రెండు ఉద్యోగాలు చేస్తూ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతోందన్నాడు.
ఒక యువతి తనపై జరిగిన వేధింపుల విషయాన్ని బహిరంగంగా చెప్పింది. మానసికంగా మహిళలు ఎంత బలంగా ఉన్నారో, శారీరకంగా కూడా బలంగా మారాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పింది. మరో అమ్మాయి తన అమ్మ క్యాన్సర్‌తో మూడోసారి పోరాడుతోందని వెల్లడించింది. ఆమె స్టేజ్‌పై చేసిన కామెంట్స్‌కి స్పందించిన నవదీప్.. “ఈ సమయంలో మీ అమ్మ పక్కన ఉండాల్సింది, ఈ షో ముఖ్యమా?” అని అనేసరికి ఆమె ఆలోచనలో పడింది.మొత్తానికి అగ్ని పరీక్ష కూడా రోజు రోజుకి మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇక అందరి అంచనాలకి తగ్గట్టే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. కామన్ మ్యాన్‌కి తొలిసారి అవకాశం రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.