Bigg Boss 9 Winner |బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కు ఘనంగా ముగింపు పలికారు. ముందునుంచి వినిపిస్తున్న అంచనాలు, సోషల్ మీడియాలో సాగిన ప్రచారం, ఓటింగ్ ట్రెండ్స్ అన్నీ నిజమయ్యాయి. కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల ఈ సీజన్ విన్నర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. చివరి దశకు తనూజ, కళ్యాణ్ మాత్రమే మిగలగా, ఇద్దరికీ నాగార్జున రూ.20 లక్షల ఆఫర్ ఇచ్చారు. అయితే టైటిల్ కోసమే ఆడుతున్నామని ఇద్దరూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. అనంతరం స్టేజ్‌పైకి తీసుకొచ్చిన నాగార్జున విన్నర్‌ను ప్రకటించగా, కళ్యాణ్ పేరు వినిపించడంతో స్టూడియో మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది.
దీంతో తనూజ రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఇంతవరకు అండగా నిలిచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. అయితే విన్నర్‌గా కళ్యాణ్ పేరు ప్రకటించిన వెంటనే ఆమె ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. ట్రోఫీ గెలిచిన వెంటనే కళ్యాణ్ పడాల భావోద్వేగానికి లోనయ్యారు. స్టేజ్‌పై నేలను తాకి ముద్దు పెట్టి, అందరికీ నమస్కారం చేశారు. హోస్ట్ నాగార్జున కాళ్లు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, అగ్నిపరీక్షకు షార్ట్‌లిస్ట్ అయినప్పుడే ‘వస్తున్నా, కొడుతున్నా’ అని చెప్పానని, ఇప్పుడు కప్ కొట్టి చూపించానని అన్నారు. తల్లిదండ్రులు పెంపకం, విలువలే తనను ఇంత దూరం తీసుకొచ్చాయని భావోద్వేగంగా వెల్లడించారు. “వాళ్లు లేనిదే నేను లేను” అంటూ కళ్లలో నీళ్లు పెట్టుకున్నారు.
ఇంకా మాట్లాడుతూ ఈ విజయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అగ్నిపరీక్ష నుంచి తనకు ధైర్యం ఇచ్చిన ప్రియా, శ్రీజతో పాటు వన్ అండ్ ఓన్లీ తనూజకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. “నువ్వు చేయగలవు అని నన్నుప్రోత్సహించింది తనూజే. ఈ సక్సెస్‌లో ఆమెకు కూడా క్రెడిట్ ఉంటుంది” అంటూ కళ్యాణ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కళ్యాణ్ తల్లిదండ్రులు కూడా స్టేజ్‌పైకి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. తెలిసినవాళ్లు, తెలియని వాళ్లు ఎంతోమంది తమ కుమారుడికి మద్దతుగా నిలిచారని, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణ్ విన్నర్‌గా నిలవడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. విన్నర్‌గా కళ్యాణ్‌కు ప్రైజ్ మనీ, కారు గిఫ్ట్‌తో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా లభించింది. రోఫ్ కంపెనీ తరఫున అదనంగా రూ.5 లక్షల ప్రైజ్ మనీ అందజేయడం విశేషంగా నిలిచింది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కామన్ మ్యాన్ విజయం తో చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.