Bigg Boss 9 | స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ఐదో వారంలోకి ప్రవేశించింది. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈసారి షో అంతగా ఆకట్టుకోవడం లేదనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు డల్‌గా ఆడుతున్నారని, గేమ్‌లో ఉత్కంఠ లేకపోవడంతో వీక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని నెటిజన్లు చెబుతున్నారు. దీంతో షోపై మళ్లీ హైప్ పెంచేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ఆదివారం షోలో భారీ ట్విస్ట్ రాబోతోందట.
వైల్డ్ కార్డ్ ఎంట్రీల రూపంలో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్. ఇప్పటికే “ఫైర్ స్టోర్మ్” పేరుతో కొత్త టాస్క్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఈ ఎంట్రీలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆరుగురిలో ఇద్దరు సెన్సేషనల్ స్టార్లు ఉండగా, మిగతా నలుగురు కొత్త ఫేస్‌లు. వీరిలో ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీ దివ్వెల మాధురి పేరు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలతో హల్చల్ చేసిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి రావడం ఖాయమని తెలుస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలో పాపులర్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందనే సమాచారం ఉంది. రమ్య గ్లామర్, ట్రోల్స్, మరియు పికిల్స్ వీడియోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఆమె ఎంట్రీ షోకు గ్లామర్ యాంగిల్ పెంచుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అలాగే టీవీ మరియు సినీ నటి అయేషా జీనత్ , యూట్యూబర్ నిఖిల్ నాయర్ , ఇన్ఫ్లూయెన్సర్ గౌరవ్ గుప్తా , కమెడియన్ ప్రభాస్ శ్రీను పేర్లు కూడా వైల్డ్ కార్డ్ లిస్టులో ఉన్నాయి. అయితే చివరి క్షణంలో ఎవరు హౌస్‌లోకి అడుగు పెడతారో అనేది ఆదివారం ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది.
గత సీజన్ల మాదిరిగా ఈసారి కూడా బిగ్ బాస్ నిర్వాహకులు వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆ హైప్ రాకపోవడంతో, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు షోకి కొత్త ఊపుని తెచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఈ కొత్త కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి గేమ్ ఆడతారు? షోకు కొత్త ఎంటర్టైన్మెంట్ తెస్తారా? అనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకులలో నెలకొంది. మరి బిగ్ బాస్ ప్రియులు ఈ ఆదివారం ఎపిసోడ్ మిస్ కావొద్దు, ఎందుకంటే ఇది “వైల్డ్ కార్డ్ స్టార్మ్” అని చెప్పవచ్చు!