Bigg Boss 9 |బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ ప్రేక్షకులకు పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని అందించింది. ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయాలు షోపై ఆసక్తిని మరింత పెంచాయి. ప్రతి సీజన్లో ఒకరు లేదా ఇద్దరు కామనర్ ఎంట్రీలకే పరిమితమై ఉంటుంది. కాని బిగ్ బాస్, సీజన్ 9లో మాత్రం ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టి, అక్కడి నుంచి ఆరుగురు కామనర్లను నేరుగా హౌస్‌లోకి పంపించింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 9ను పూర్తిగా ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’గా డిజైన్ చేశారు. ఈ కాన్సెప్ట్ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకుంది. అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్లు సెలబ్రిటీలకు ఏమాత్రం తగ్గకుండా ఆట ఆడటమే కాకుండా, షోకి కొత్త ఎనర్జీని తీసుకువచ్చారు.
అందులో ముఖ్యంగా కళ్యాణ్ పడాల టైటిల్ విజేతగా నిలవడం బిగ్ బాస్ చరిత్రలోనే ఓ ప్రత్యేక ఘట్టంగా మారింది. కామనర్‌గా అగ్నిపరీక్ష నుంచి వచ్చి బిగ్ బాస్ టైటిల్ గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇదే అగ్నిపరీక్ష కాన్సెప్ట్‌కు భారీ క్రేజ్ తీసుకువచ్చింది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1లో సెలెక్ట్ అయిన ఆరుగురిలో ఒకరు టాప్ 3 వరకు చేరగా, మరోకరు నేరుగా టైటిల్ విజేతగా నిలవడం మేకర్స్ అంచనాలను కూడా మించి పోయింది. దీంతో ఇకపై బిగ్ బాస్ షోలో కామనర్స్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన బలపడినట్టు తెలుస్తోంది. టాలెంట్ ఉన్న సాధారణ యువతకు బిగ్ బాస్ వేదికపై అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అగ్నిపరీక్షను సీజన్ల వారీగా కొనసాగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంటే ఇకపై ప్రతి బిగ్ బాస్ సీజన్‌కు ముందే అగ్నిపరీక్ష నిర్వహించి, అందులోంచి కొంతమందిని హౌస్‌లోకి పంపించే విధానం కొనసాగనున్నట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1ను శ్రీముఖి హోస్ట్ చేయగా, అభిజిత్, నవదీప్, బింధు మాధవి జడ్జులుగా వ్యవహరించారు. ఈ ప్యానెల్‌కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అగ్నిపరీక్ష సీజన్ 2కి కూడా ఇదే టీమ్ కొనసాగుతుందా? లేక కొత్త హోస్ట్, కొత్త జడ్జులను తీసుకొస్తారా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ ఎంత ఉందో, ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్షకు కూడా అదే స్థాయిలో హైప్ ఏర్పడుతోంది. కళ్యాణ్ పడాల అగ్నిపరీక్ష నుంచి వచ్చి టైటిల్ గెలిచిన తర్వాత, “అగ్నిపరీక్షే బిగ్ బాస్‌కు షార్ట్‌కట్” అనే భావన ప్రేక్షకుల్లో, యువతలో బలంగా ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే బిగ్ బాస్ సీజన్ 10 కోసం నిర్వహించే అగ్నిపరీక్ష సీజన్ 2కి భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈసారి అగ్నిపరీక్షను బిగ్ బాస్ షో ప్రారంభానికి కేవలం 10 రోజుల ముందు కాకుండా, దాదాపు రెండు నెలల ముందే గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో 2026 సెకండ్ హాఫ్‌లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2ను మరింత పెద్ద స్థాయిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.