Bigg Boss 9 | ‘రాను బొంబైకి రాను’ పాట వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఏ ఫంక్షన్ అయిన, చిన్నపాటి దావత్ జరిగిన ఈ పాట తప్పక ప్లే అవుతుంది. ఈ పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన రాము రాథోడ్ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో సందడి చేస్తున్నాడు. ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన రాము రాథోడ్ ఈ రోజు బిగ్ బాస్ షోతో ప్రపంచానికి పరిచయం అయ్యాడు. తాను ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిగా మారింది. తాజాగా రాము తల్లిదండ్రులు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు చెప్పిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ను కదిలిస్తున్నాయి. “మేము మన్ను మోశాం… కూలీ చేశాం… పురుగులతో ఉన్న అన్నం కూడా తిన్న రోజులున్నాయి అని చెప్పుకొచ్చారు రాము తల్లిదండ్రులు. పని చేసే చోట పురుగుల అన్నం పెడితే ఆ పరుగులు పక్కన పెట్టి తిన్న రోజులు కూడా ఉన్నాయని రాము పేరెంట్స్ అన్నారు.
మా పిల్లలు పెరిగింది ముంబైలో. రాము అప్పుడప్పుడు ముంబైకి వచ్చేవాడు. పాత ఇనుప సామాను ఏరేవాడు… చేపలు పట్టేవాడు. రోజుకు నాలుగు ఐదు వందల రూపాయలే సంపాదించేవాడు అని గుర్తు చేసుకున్నారు. పాపులారిటీ వచ్చిన తర్వాత రాము తన గ్రామానికి తిరిగి వెళ్లి తన తల్లిదండ్రుల కోసం కొత్త ఇల్లు కట్టించాడు. “మా కొడుకు చెమటతో మేము ఈ రోజు ఇలా ఉన్నాము” అని రాము తల్లిదండ్రులు చాలా భావోద్వేగంగా చెప్పారు. రాము బిగ్ బాస్ హౌజ్‌లో సంతోషంగా ఉండడం చూసి మాకు ఆనందంగా ఉంది. కాకపోతే బిగ్ బాస్ ఇంట్లో గొడవలు పడడం అంత బాగోలేదని వారు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రాము రాథోడ్ పోటీదారుగా ఉన్నాడు. గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ యువకుడు ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్‌పై తన హాస్యం, సెన్సిబిలిటీ, హ్యూమర్ టచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రాము రాథోడ్ ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా ఎన్ని వారాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం గోపాలపూర్ ఖుర్ద్ గ్రామంలో పుట్టి పెరిగిన అతను చిన్నప్పటి నుంచే జానపద గాయకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. భూత్పూర్, మహాబూబ్ నగర్ జిల్లాలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని పాట 516 మిలియన్ల వరకు చేరుకుందని అన్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ నుండి రెవిన్యూ కూడా బాగానే అందుకున్నాడని సమాచారం.