Bigg Boss 9 | బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ రోజురోజుకూ ఉత్కంఠను పెంచుతోంది. తాజాగా జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎపిసోడ్ హౌస్మేట్స్తోపాటు ఆడియన్స్‌కి కూడా షాకిచ్చింది. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దివ్య నికితా అడుగుపెట్టిన తర్వాత ఊహించని ట్విస్ట్‌లతో బిగ్‌బాస్ ఆటని కొత్త మలుపు తిప్పాడు. బిగ్‌బాస్ “చక్రవ్యూహం” పేరిట ఒక వినూత్న టాస్క్‌కి తెరలేపాడు. ఇందులో భాగంగా రెడ్ సీడ్ పొందిన హౌస్‌మేట్స్‌కి ఒక ప్రత్యేక అధికారం ఇచ్చారు. ఒకరిని ఇంటి నుంచి బయటికి పంపే అధికారం వారికి ఉంటుంది. ఈ హక్కును వినియోగించి భరణి, హరీష్, కళ్యాణ్, డీమాన్, రాము కలిసి సంజనను ఎలిమినేట్ చేయాలని నిర్ణయించారు.
సంజన “పర్సనల్ అటాక్స్”, “ఎమోషనల్ గేమ్ ప్లే”, “సేఫ్ గేమ్” ఆడుతున్నదంటూ ఆరోపణలు ఎదుర్కొంది. హరీష్ అయితే ముందే స్పష్టంగా చెప్పేశాడు . “ఈ షో దొంగల షో అవకూడదు”. డీమాన్, రాము తో పాటు ఇతరులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరూ ఏకాభిప్రాయంతో సంజన పేరునే తేల్చారు. దాంతో సంజన ఎలిమినేట్ అయింది. సంజన ఎలిమినేట్ కావడంతో ఇమ్మానుయేల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని మనోవేదన చూసి హౌస్ మొత్తం ఎమోషన్లో మునిగిపోయింది. అయితే పెద్ద ట్విస్ట్ ఏంటంటే… సంజన నిజంగా హౌస్ నుండి బయటకి వెళ్లలేదు . ఆమె సీక్రెట్ రూమ్‌కి వెళ్లింది. అక్కడి నుంచి హౌస్‌లో జరుగుతున్నదాన్ని ఆమె గమనిస్తోంది.
సంజన సీక్రెట్ రూమ్‌లో ఉండటాన్ని ముందే ఊహించినట్టు భరణి, హరీష్ మాట్లాడుకున్నారు. ఆమె తిరిగి హౌస్‌లోకి రావడం ఖాయమనే అంచనాలు ఇప్పటికే నెట్టింట్లో చర్చకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉండగా, దివ్య నికితా ర్యాంకింగ్స్ ఆధారంగా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మానుయేల్ గెలిచి హౌస్ మూడో కెప్టెన్‌గా అవతరించాడు. సంజన సీక్రెట్ రూమ్‌లో ఉండటంతో, ఆమె రీఎంట్రీ ఎప్పుడు? ఎలా? అనే ప్రశ్నలు ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతున్నాయి. ఇక నుంచి ఆమె గేమ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఒకవేళ తిరిగి వస్తే , గేమ్‌లో నెక్స్ట్ లెవెల్ మాస్ ట్రాక్ కావొచ్చు అని కొందరు ఊహాలోచనలు చేస్తున్నారు.