Bigg Boss 9 | తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ హైపర్ ఎంటర్టైన్మెంట్ షో, ఇప్పుడు సీజన్ 9 రూపంలో ప్రేక్షకులను పలకరించేందుకు రంగంలోకి దిగుతోంది. ఈ మేరకు మేకర్స్ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7 నుండి ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రోమోలో నాగార్జున “డబుల్ హౌస్ – డబుల్ డోస్” అంటూ చెబుతుండటంతో, ఈ సీజన్ ఫార్మాట్ పై ప్రేక్షకుల్లో కుతూహలం మరింత పెరిగింది.
ఈసారి బిగ్ బాస్ హౌస్ ఒకటి కాదు.. రెండు. ఒకవైపు సెలెబ్రిటీలు ఉంటే, మరోవైపు కామనర్స్ కనిపించనున్నారు. ఈ సీజన్ థీమ్ – “Celebrities vs Commoners” అన్నమాట. ఈ కాన్సెప్ట్ బిగ్ బాస్ ఫాన్స్‌కి కొత్త అనుభూతినివ్వనుంది. షో ప్రారంభం నుండే ఆసక్తికర మలుపులు కనిపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. కామనర్స్ ఎంపిక కోసం మేకర్స్ ప్రత్యేకంగా ‘అగ్ని పరీక్ష’ పేరుతో ఓ ప్రీ-షోను నిర్వహించారు. వేలాది మంది అప్లికేషన్ల నుంచి 40 మందిని సెలెక్ట్ చేసి, వారిని కఠినమైన టాస్క్‌లకు లోనుచేశారు. ఈ పరీక్షల్లో విజేతలైన టాప్ 3 కామనర్స్‌కి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ దక్కనుంది. ఈ ప్రీ-షోకి అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
సీజన్ 9కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగనున్నారు. ఆయన ఎనర్జీ, హ్యూమర్, చక్కటి హ్యాండ్లింగ్ గత సీజన్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రోమోలో ఆయన వాయిస్ ఓవర్లు, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి హైప్‌ను పెంచాయి.ఇప్పటివరకు కంటెస్టెంట్స్ జాబితా అధికారికంగా ప్రకటించలేకపోయినా, సోషల్ మీడియాలో ఇప్పటికే పలు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో సాయి కిరణ్, ఛత్రపతి శేఖర్, ఇమ్మాన్యుయెల్, సుమంత్ అశ్విన్, ముఖేష్ గౌడ్, శివ కుమార్, రీతూ చౌదరి, దీపికా, కావ్య శ్రీ, తేజస్విని, దేబ్జానీ, అలేఖ్య చిట్టి పికిల్స్, నవ్యసామి, మై విలేజ్ షో అనిల్ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 మరింత గ్లామర్, డ్రామా, కాంట్రవర్సీ, ఎమోషన్‌తో మేళవించి భారీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ హౌస్‌లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే!