Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికర దశలోకి చేరుకుంది. ఇప్పటికే 61 రోజులు పూర్తి కాగా,ఫైనల్‌కి కేవలం ఆరు వారాల మాత్రమే సమయం మిగిలి ఉంది. ప్రస్తుతం తొమ్మిదో వారం రన్ అవుతుండగా, ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య బంధాలు మారిపోతున్నాయి. సేఫ్ గేమ్ నుంచి బయటపడే ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయి. ప్రతి రోజు కొత్త టర్న్ తీసుకుంటున్న షోలో శుక్రవారం ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. డీమాన్ పవన్, రీతూ చౌదరి మధ్య దూరం పెరిగింది. వీరు ఇద్దరూ మాట్లాడుకోకపోవడంతో హౌస్‌లో కొత్త టాపిక్ మొదలైంది. రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్ వీరిపై సరదా సెటైర్లు పేలుస్తూ నవ్వులు పూయించారు.
సాధారణంగా సైలెంట్‌గా ఉండే రాము కూడా ఈసారి పంచ్‌లతో ఎంటర్టైన్ చేశాడు. ‘ఒంటరైన పక్షి’ అంటూ పవన్‌పై వేసిన పంచ్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. రీతూ కూడా ఈ సరదా మూమెంట్లో భాగమవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బిగ్ బాస్ పదవ వారానికి కెప్టెన్సీ టాస్క్ ప్రకటించాడు. కంటెస్టెంట్లు రెండు ట్రైన్లలో ఎక్కి డ్రైవర్ సీట్ దక్కించుకునే పోటీ ప్రారంభమైంది. మొదట సీట్ దక్కించుకున్న రాము రాథోడ్ భరణిని తొలగించగా, తర్వాత శ్రీనివాస సాయి దివ్యను, నిఖిల్ సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు. చివరగా సీట్ దక్కించుకున్న దివ్య తనూజను టాస్క్ నుంచి తొలగించింది. దీంతో తనూజ ఆగ్రహంతో దివ్యపై విరుచుకుపడింది. “భరణి కారణంగానే నన్ను తొలగించావు, పర్సనల్ కక్షతో అలా చేసావు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఏడుస్తూ రూమ్‌లోకి వెళ్లిపోవడంతో హౌస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భరణి, రీతూ, ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.
కెప్టెన్సీ టాస్క్ చివర్లో రీతూ చౌదరి, ఇమ్మాన్యుయెల్ మధ్య కౌంట్ టాస్క్ జరిగింది. చివరికి ఇమ్మాన్యుయెల్ విజేతగా నిలిచి రెండోసారి కెప్టెన్ హోదా దక్కించుకున్నాడు. డీమాన్ పవన్ తర్వాత ఈ సీజన్లో రెండుసార్లు కెప్టెన్ అయిన కంటెస్టెంట్‌గా ఇమ్మాన్యుయెల్ రికార్డ్ సృష్టించాడు. ఎపిసోడ్ చివర్లో తనూజ, దివ్యల మధ్య భరణి సాండ్విచ్ అవుతున్నాడంటూ సంజనా వేసిన జోక్ బాగా వైరల్ అయింది. తరువాత సంజనా, తనూజ, సుమన్ శెట్టి కలిసి చిన్న స్కిట్ ప్రదర్శించారు. సుమన్ పెళ్లికొడుకుగా, ఇద్దరు అమ్మాయిలు అతని కోసం గొడవపడే సన్నివేశం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. “ఎన్ని జన్మలైనా నువ్వే నా మొగుడు” అంటూ సంజనా చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది. మొత్తంగా, బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం ఎపిసోడ్లో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, డ్రామా అన్నీ పుష్కలంగా కనిపించాయి. రాబోయే వారాల్లో ఈ రియాలిటీ షో మరిన్ని ట్విస్టులతో సాగే అవకాశం ఉంది.