Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 67వ రోజు మొత్తం నవ్వులు, కోపాలు, వ్యూహాలతో నిండిపోయింది. హౌస్‌లోకి ప్రత్యేక అతిథిగా వచ్చిన సెలెబ్రిటీ చెఫ్ సంజయ్, హౌస్ మేట్స్‌కి తన వంటకాలతో రుచికరమైన విందు ఇచ్చి సందడి చేశారు. రాజులు, రాణులతో పాటు కమాండర్లు, ప్రజల్ని కూడా పలకరించిన సంజయ్ కొంతసేపటి తర్వాత హౌస్‌ను విడిచి వెళ్లారు. అయితే అందరికీ ఒకేలా విందు అందకపోవడం హౌస్‌లో కొత్త తగాదాలకు దారి తీసింది. రాజులు, రాణులు వేరుగా భోజనం చేయగా, కమాండర్లు, ప్రజలు వేరుగా కూర్చుని తినాల్సి రావడం అసంతృప్తికి కారణమైంది.
విందు తర్వాత ప్రజలైన ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, భరణి, గౌరవ్ తిరుగుబాటు మొదలు పెట్టారు. కమాండర్లు తమపై అధికారం చలాయించడంతో తామెందుకు భరించాలి? రాజులు తినే భోజనమే మాకు ఇవ్వాలి అంటూ డిమాండ్లు మొదలుపెట్టారు. రాజులు నిఖిల్, కళ్యాణ్, రీతూ మధ్యవర్తిత్వానికి దిగినా, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి మరింతగా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ హౌస్‌ను గందరగోళంగా మార్చేశారు. అయితే ఇదంతా వారు సరదాగే చేశారు. ఇక చర్చలకు వచ్చిన రాజుల ముందు ఇమ్మాన్యుయేల్ తన డిమాండ్లు స్పష్టంగా ఉంచాడు. కమాండర్లు చెప్పిన పనులు చేయబోమని, తమ పనులు తామే చేసుకుంటామని ప్రకటించాడు. దీనితో బిగ్ బాస్ హౌస్‌లోని శక్తి సమీకరణాలను పూర్తిగా మార్చే కొత్త టాస్క్‌ను ఇచ్చాడు. రాజులు తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలి. కమాండర్లు రాజ్యాన్ని దక్కించుకోవాలి.
కొత్త టాస్క్ ప్రకారం కమాండర్ల నుంచి ఎవరు పోటీలో ఉండాలో ప్రజలే నిర్ణయించాలి. కమాండర్లు దివ్య, పవన్, సంజన, తనూజ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు ప్రజలు దివ్య, తనూజలను పోటీకి ఎంపిక చేశారు. వీరిద్దరిలో ఒకర్ని కళ్యాణ్ రాజుగా పోటీ చేసేందుకు సెలెక్ట్ చేయాలి. ఈ బాధ్యతను కళ్యాణ్ తీసుకున్నాడు. కళ్యాణ్ తనతో పోటీ పడేందుకు తనూజనే ఎంచుకున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన కఠినమైన క్యూబ్ టాస్క్ ప్రారంభమైంది. అడ్డంకులు దాటి క్యూబ్స్‌ని అమర్చాలి. ఒకే రంగు వరుసగా రాకూడదనే నిబంధనతో టాస్క్ మరింత క్లిష్టమైంది. ఇద్దరూ వేగంగా, సమర్థంగా క్యూబ్స్ అమర్చినా చివరకు తనూజ ముందంజ వేసి విజయం సాధించింది. ఈ విజయం తనూజకు మహారాణిగా మారే అవకాశాన్ని అందించింది. ఇక రాజు స్థానాన్ని కాపాడుకోవాలంటే కళ్యాణ్‌కు మరింత కష్టం తప్పదని స్పష్టమైంది. బిగ్ బాస్ హౌస్‌లో అధికార పోరాటం ఇంకా వేడెక్కుతుందనే సంకేతాలు ఈ ఎపిసోడ్ ద్వారా అర్ధమైంది.