Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి వారం హౌజ్ పూర్తి సరదా వాతావరణంతో కొనసాగింది. కంటెస్టెంట్లపై ఒత్తిడి తగ్గించేందుకు బిగ్‌బాస్ చిన్న చిన్న ఫన్ టాస్కులు ఇస్తూ, వారికి ఇష్టమైన ఫుడ్‌తో ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్లో ‘వన్స్ మోర్ వన్ లాస్ట్ ఛాన్స్’ అనే సరదా టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో డీమాన్ పవన్ విజయం సాధించగా, ప్లేయర్ ఆఫ్ ది డే అవార్డును తనూజ దక్కించుకుంది. అవార్డు లో భాగంగా ఆమెకు ఇంటి నుంచి ఫోటో పంపించగా, అది ఆమె చెల్లి పెళ్లి ఫోటో కావడం, అందులో తనూజను కూడా మెర్జ్ చేయడంతో ఆమె తీవ్రంగా ఎమోషనల్ అయ్యింది. మరోవైపు టాస్క్ గెలిచిన డీమాన్ పవన్ తన భావాలను పంచుకుంటూ బిగ్‌బాస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. చివరి వారానికి రావడం ఆనందంతో పాటు బాధగా ఉందని, హౌస్‌ను వదిలి వెళ్లాలనిపించడం లేదని చెప్పాడు.
తన జర్నీలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ, కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడలేకపోయానని, అలా మాట్లాడితే ఎదుటివారు హర్ట్ అవుతారనే భావన వల్లే మౌనంగా ఉన్నానని చెప్పి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక ఎక్స్ట్రా కట్లో మరో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. అందరూ కలిసి ఓ స్కిట్ ప్రదర్శించగా, ఇందులో ఇమ్మాన్యుయెల్ అత్త పాత్రలో, కళ్యాణ్, పవన్ కొడుకులుగా, సంజనా, తనూజ కోడళ్లుగా నటించారు. అత్తగా మారిన ఇమ్మూ పూర్తిగా రెచ్చిపోయి కోడళ్లపై ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా తనూజ పని చేయకుండా ముచ్చట్లు పెడుతోందని, ఆ తర్వాత సంజనాపై కూడా మండిపడుతూ “ఇది నాకే అత్తగా ఉంది, నాకు కోడళ్లు ఏంట్రా” అంటూ రచ్చ చేశాడు . పవన్‌కి రీతూని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడమే కాకుండా, కళ్యాణ్‌ను ఉద్దేశించి “నీకు ఎవరు కావాలి?” అని అడిగి, చివరికి “రమ్య కావాలా?” అని చెప్పడంతో హౌస్ మొత్తం నవ్వులతో మార్మోగింది.
ఈ కామెంట్ ప్రేక్షకుల్లోనూ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఇటీవల రమ్య, కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలు, అతన్ని అమ్మాయిల పిచ్చి ఉన్నవాడిగా చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ కావడం, ఆ క్రమంలో ట్రోల్స్‌కు గురైన నేపథ్యంలో, ఇమ్మాన్యుయెల్ ఇప్పుడు రమ్య పేరును ప్రస్తావించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్కిట్లో కళ్యాణ్‌కు జోడీగా తనూజ కనిపించినా, ఆమెను కాదని రమ్యని తీసుకురానా అంటూ ఇమ్మూ చెప్పడం నవ్వులు పూయించినప్పటికీ, తెరవెనుక ఏదో కథ ఉందేమో అనే అనుమానాలకు కూడా తావిస్తోంది. మొత్తంగా చివరి వారం ఎపిసోడ్ ఫన్, ఎమోషన్, వివాదాస్పద కామెంట్లతో ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టైన్ చేసింది.