Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకు సస్పెన్స్, డ్రామా, ఎమోషన్ల మిశ్రమంగా మారుతోంది. ప్రతి రోజు కొత్త ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ టీమ్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లతో హౌస్‌ను హీటెక్కించింది. ఈ సారి కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ మూడు టీమ్‌లను ఏర్పాటు చేశాడు . బ్లూ, పింక్, ఆరెంజ్. సభ్యుల ఎంపికను కూడా కంటెస్టెంట్స్‌కే అప్పగించాడు. టాస్క్ ప్రారంభమైన వెంటనే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్‌లో ఇద్దరిని ‘రెబల్స్’ గా మార్చి, వారికి సీక్రెట్ టాస్క్‌లను అప్పగించాడు. ఫస్ట్ రెబల్‌గా సుమన్ శెట్టి, సెకండ్ రెబల్‌గా దివ్యా నియమితులయ్యారు.
దివ్య తన సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో, ఒక కంటెండర్‌ను కెప్టెన్సీ రేస్ నుండి తప్పించే పవర్ వచ్చింది. సుమన్‌తో చర్చించి, వారు పవన్ కళ్యాణ్ ను టాస్క్ నుంచి తొలగించాలని నిర్ణయించారు. బిగ్ బాస్ ఫోన్ ద్వారా పవన్‌కు ఆదేశాలు రాగా, ఆయన నవ్వుతూ స్పందించినా, లోపల నిరాశ స్పష్టంగా కనిపించింది. “నా బొంద.. శార్ధం!” అంటూ స్వల్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి టాస్క్‌లో బిగ్ బాస్ హౌస్‌లో పాలు దాచమని రెబల్స్‌కు ఆదేశించాడు. సుమన్, దివ్య స్మార్ట్‌గా ప్లాన్ చేసి, ఎవరికీ తెలియకుండా పాలను స్టోర్ రూమ్‌లో దాచేశారు. పవన్ కళ్యాణ్‌కు అనుమానం వచ్చినా, దివ్య చాకచక్యంగా కవర్ చేసి టాస్క్ సక్సెస్ చేశారు.
బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్, రీతూ మాట్లాడకూడదని నియమం. అయితే డిన్నర్ సమయంలో వారు మాట్లాడటానికి ప్రయత్నించగా, దివ్య వారిని ఆపింది. ఇది రీతూ కోపానికి కారణమైంది. “టాస్క్ గురించి మాట్లాడుతున్నాం” అంటూ రీతూ వాదించగా, పవన్ కూడా మధ్యలో జోక్యం చేసుకోవడంతో చిన్న గొడవ చోటుచేసుకుంది. మూడు టీమ్‌ల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగగా, ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్‌లో ఆరెంజ్ టీమ్ విజయం సాధించింది. బిగ్ బాస్ వారిని గ్రీన్ ఇమ్యూనిటీ బ్యాడ్జ్‌తో సత్కరించారు. టీమ్ సభ్యులు కలసి ఆ బ్యాడ్జ్‌ను ఇమ్మాన్యూయెల్కు ఇవ్వడం గమనార్హం. సంజనాని ఎవరూ టీమ్‌లోకి తీసుకోకపోవడంతో ఆమెను సంచాలక్ గా నియమించారు. మరో రెండు రోజులు కెప్టెన్సీ టాస్క్‌లు కొనసాగనున్నాయి. ఎవరు 9వ వారం కెప్టెన్ అవుతారనే ఆసక్తి ఇప్పుడు పీక్స్‌లో ఉంది. పవన్ కళ్యాణ్ ఔట్ అయిన తర్వాత గేమ్ మరింత ఇన్టెన్స్గా మారింది.