Bigg Boss 8 Grand Finale – Police restrictions in Hyderabad | తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 (Bigg Boss 8 Grand Finale) గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలు సూచనలతో పాటు హెచ్చరికలు జారీ చేశారు. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నేడు గ్రాండ్ ఫినాలే అన్న విషయం తెలిసిందే. అయితే ఫినాలే నేపథ్యంలో ఈ షో జరిగే అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు ఎక్కువగా రానున్న క్రమంలో పోలీసులు ఆంక్షలు విధించారు. కార్యక్రమం అనంతరం ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదంటూ ప్రకటన విడుదల చేశారు.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిసేవరకు జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో ఎవరు కనిపించవద్దని ఆంక్షలు విధించారు. అలాగే స్టూడియో బయట భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. హద్దుమీరి ఉరేగింపులు, ర్యాలీలు కానీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బిగ్‌బాస్ సీజన్ 7లో ఫినాలేలో భాగంగా.. గత ఏడాది పల్లవి ప్రశాంత్ విజేతగా ప్రకటించిన అనంతరం అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ ట్రాఫీక్తో స్తంభించిపోవడమే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొందరూ అయితే ఆర్టీసీ బస్సులతో పాటు కార్లపై దాడి చేయడంతో ప్రభుత్వానికి చెందిన ఏడు ఆర్టీసీ బస్సులు, పలుకార్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరికలు జారీ చేశారు.