Bigg Boss 12 | బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ ఘనంగా ముగిసింది. ఈ సీజన్లో 23 మంది పోటీదారులను వెనక్కి నెట్టి గిల్లి విజేతగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని సాధించాడు. షో హోస్ట్ సుదీప్ వేదికపై గిల్లి చేయి పైకెత్తి అతడిని సీజన్ 12 టైటిల్ విజేతగా అధికారికంగా ప్రకటించారు. 40 కోట్లకు పైగా ఓట్లు సాధించి గెలవడం ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీజన్ ప్రారంభం నుంచే తన ఆటతీరు, వ్యూహం, అలాగే ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యక్తిత్వంతో గిల్లి హౌస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు, పలు రియాలిటీ షోల్లో పాల్గొని ప్రతిసారీ రన్నరప్‌గా నిలిచిన గిల్లి, ఈసారి మాత్రం విజేతగా నిలిచి తన కెరీర్లో కీలక మైలురాయిని చేరుకున్నాడు.
గతంలో విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయిన అతడు, బిగ్ బాస్ వేదికపై పూర్తి స్థాయి సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సీజన్లో రక్షిత కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. మొదటి రోజు నుంచి తన ఆటతో పాటు క్యూట్‌నెస్, నిజాయితీతో ఆకట్టుకున్న రక్షిత రన్నరప్‌గా నిలిచింది. గిల్లి–రక్షిత మధ్య జరిగిన పోటీ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగి, ఫైనల్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది. విజేతగా నిలిచిన గిల్లికి బిగ్ బాస్ వేదికపై రూ.50 లక్షల ప్రైజ్ మనీని ప్రకటించారు. దీనితో పాటు మారుతి సుజుకి విక్టోరిస్ కారును కూడా బహుమతిగా అందజేశారు. అదనంగా, హోస్ట్ సుదీప్ తన మంచి మనసును చాటుకుంటూ గిల్లికి ప్రత్యేకంగా రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించడం అభిమానులను ఆకట్టుకుంది.
అయితే, బిగ్ బాస్ ప్రైజ్ మనీపై ప్రభుత్వం విధించే పన్ను అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం, బహుమతి డబ్బుపై 30 శాతం పన్ను విధించబడుతుంది. దీంతో రూ.50 లక్షల ప్రైజ్ మనీలో గిల్లికి నికరంగా సుమారు రూ.35 లక్షలు మాత్రమే అందుతాయి. మిగిలిన మొత్తం ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. సుదీప్ ప్రకటించిన రూ.10 లక్షల బహుమతిపై కూడా పన్ను వర్తిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.ఇక రన్నరప్ రక్షితకు ప్రకటించిన రూ.25 లక్షల ప్రైజ్ మనీపై కూడా పన్ను వర్తిస్తుంది. 30 శాతం పన్ను తగ్గించిన తర్వాత ఆమెకు సుమారు రూ.17.5 లక్షలు మాత్రమే అందుతాయి. ఈ విధంగా, బిగ్ బాస్ సీజన్ 12 విజేతలు భారీ బహుమతులు అందుకున్నప్పటికీ, పన్నుల కారణంగా నికరంగా వచ్చే మొత్తం తగ్గుతుంది.