Re-Release Movies| రీ-రిలీజ్‌ల వల్ల లాభాలెంతున్నాయో తెలీదు కానీ నష్టాలు మాత్రం చాలానే కనిపిస్తున్నాయి. స్టార్ల సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయంటే చాలు థియేటర్ ఓనర్ల టెన్షన్ అంతా ఇంతా కాదు. అత్యుత్సాహంతో ఎక్కడ స్క్రీన్లు చినగ్గొడతారో.. ఎక్కడ సీట్లు విరగ్గొడతారో అన్న రందే ఒక్కువైపోయింది. వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే చిన్న సినిమాలు పరిస్థితి ఇంకా దారుణం. మాములుగానే లో బడ్జెట్ సినిమాలకు పెద్దగా హైప్ ఉండదు. పైగా ఆ సినిమాలను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ పడే కష్టం మాటల్లే చెప్పలేనిది. కంటెంట్ బాగుండి.. మౌత్ టాక్ బాగా వస్తే రెండో రోజు నుంచి కలెక్షన్ల సంఖ్య పెరిగే చాన్స్ ఉంటుంది. అయితే రీ-రిలీజ్ సినిమాల వల్ల చిన్న సినిమాలు నలిగిపోతున్నాయన్నది అక్షర సత్యం. ఇది వరకు కంటెంట్ కొత్తగా ఉండి యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా సినిమాలు కమర్షియల్‌గా సేఫ్ అయ్యేవి.
కానీ రీ-రిలీజ్‌ల వల్ల చిన్న సినిమాలను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఇదే ఆవేదనను బిగ్‌బాస్ సోహైల్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చాడు. మొన్న శుక్రవారం రిలీజైన కొత్త సినిమాల్లో ఇదీ ఒకటి. టీజర్, ట్రైలర్లు సహా ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో చేయడంతో రిలీజ్ ముంగిట కాస్త మంచి హైపే వచ్చింది. పురుషుడు గర్భం దాల్చడం అనే కాన్సెప్ట్ వెండితెరపై తొలిసారి విన్నదే. తొలిఆట నుంచే సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. ఎగ్జిక్యూషన్లో కాస్త తడబడినా.. ఓవరాల్‌గా చూడదగిన సినిమానే అంటూ రివ్యూలు ఇచ్చేశారు. అయితే టాక్‌కు కలెక్షన్లకు ఏ మత్రం పొంతనలేదని సమాచారం. అంత మంచి రివ్యూలు తెచ్చుకున్న సినిమా కమర్షియల్‌గా ఎదురీగాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
కాగా బిగ్‌బాస్ సోహైల్ నిన్న జరిగిన సక్సెస్ మీట్లో పెద్ద సినిమాలు లేనప్పుడే చిన్న సినిమాలకు అవకాశాలుంటాయి. చిన్న సినిమాలకు వీకెండ్ స్లాట్ దొరకడమే కష్టంగా ఉన్న టైమ్‌లో పెద్ద స్టార్ల సినిమాలు రీ-రిలీజ్ చేసి చిన్న సినిమాలను ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రీ-రిలీజ్‌లను శుక్రవారం రోజున కాకుండా మిగితా నార్మల్ డేస్‌లో రిలీజ్ చేస్తే బాగుంటదని వెల్లడించాడు. అలాగే ఓటీటీలోనూ కొత్త సినిమాలను వీకెండ్లో రిలీజ్ చేయకుండా మిగితా రోజుల్లో రిలీజ్ చేయోచ్చు కదా అని తెలిపాడు. దీనిపై ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు. దీని గురించి చాలామందికి అడగాలని ఉంటుంది కానీ అడగట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
దీనిపై పలువురు సోహైల్ వ్యాఖ్యలను ఏకీభవిస్తున్నారు. రీ-రిలీజ్‌లను ఏదైనా సందర్భం ఉన్నప్పుడు అంటే వార్షికోత్సవాలు.. బర్త్‌డేలు ఉన్నప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వాటివల్ల చిన్న సినిమాలు కూడా నలిగిపోతున్నాయని తెలుపుతున్నారు. మరీ దీనిపై ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.