సినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూడ్డం పరిపాటే. కానీ సినిమా అప్డేట్ కోసం కూడా ఆడియన్స్ ఇంతలా ఎదురు చూడ్డం బహుశా ‘SSMB 29’కే జరుగుతున్నది. మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఎస్.గోపాల్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు రాజమౌళి. హాలీవుడ్ నటీనటుల్ని ఇందులో నటింపజేయడమే కాక, హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలతో టైఅప్ అయి, గ్లోబల్ స్థాయిలో సినిమాపై అంచనాలు పెంచే పనిలో ఉన్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన బిగ్ అప్డేట్ని నవంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 16న ఈ అప్డేట్ని విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజున ఫస్ట్ గ్లింప్స్‌తోపాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందనీ, ‘SSMB29’ బిగ్ అప్డేట్ అదేనని ఫిల్మ్ వర్గాల టాక్. దేశం మొత్తం షేక్ అయ్యేలా ఈ అప్డేట్ ఉంటుందని తెలుస్తున్నది. హాలీవుడ్లో జరిగే ఓ భారీ వేడుకలో ఈ అప్డేట్ని విడుదల చేస్తారట. అలాగే అవతార్ ప్రమోషన్స్ నిమిత్తం జేమ్స్ కామరూన్ నవంబర్‌లో ఇండియా వస్తున్నారని, ఆయన ద్వారానే ఈ అప్డేట్ను విడుదల చేస్తారని కూడా మరో వార్త మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నది. ప్రియాంకచోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృధ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.