Bhuvan gowda | ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’, ‘సలార్’ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆయన శుక్రవారం నిఖిత అనే యువతిని వివాహం చేసుకున్నారు. బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకలో కన్నడ స్టార్ యష్ తన భార్య రాధిక పండిట్‌తో కలిసి హాజరై వధూవరులను ఆశీర్వదించాడు. అలాగే ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా తన సతీమణితో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరిద్దరితో పాటు హీరోయిన్లు శ్రీలీల, శ్రీనిధి శెట్టి, శాన్వి శ్రీవాస్తవ, ‘కేజీఎఫ్’ ఫేమ్ గరుడ రామ్ తదితరులు ఈ వివాహ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
ప్రస్తుతం భువన్ గౌడ జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘డ్రాగన్’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ పెళ్లి అనంతరం కొద్ది రోజుల విరామం తీసుకుని షూటింగ్లో చేరనున్నారు. భువన్ గౌడ వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోటోలలో సినీ తారల జోడి, నవదంపతుల ఆనందభరితమైన క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే పెళ్లిలో ప్రశాంత్ నీల్ వైట్ పంచెతో కనిపించగా, దానిపై ప్రశాంత్ నీల్ వైఫ్ ఫన్నీ పోస్ట్ పెట్టింది. డ్రాగన్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ పెళ్లిలో దిగిన ఫోటోలను ప్రశాంత్ సతీమణి లిఖితా రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఫైనల్ గా నా దొంగ మొగుడు వైట్ డ్రెస్ లో మెరిసాడు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇందులో ప్రశాంత్ నీల్ – లిఖితా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుండడం విశేషం. సినిమాల్లో హీరోలను డార్క్ గా చూపించే దర్శకుడు.. ఇప్పుడిలా వైట్ అండ్ వైట్ లో కనిపించడంతో నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు హీరోతో కన్నడ డైరెక్టర్ చేస్తున్న కొత్త ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.