Border 3 Announcement | సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అందుకుంది. అయితే ఈ సినిమా సాధించిన భారీ విజయాన్ని పురస్కరించుకుని తాజాగా చిత్ర నిర్మాతలు ‘బోర్డర్ 3’ గురించి అధికారిక ప్రకటన చేశారు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మరియు జేపీ ఫిల్మ్స్ నుంచి నిధి దత్తా కలిసి ఈ ఐకానిక్ ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేతులు కలిపారు.
ప్రస్తుతం థియేటర్లలో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ వంటి స్టార్లతో అలరిస్తున్న ‘బోర్డర్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ ఓపెనింగ్ వీకెండ్ సక్సెస్ ఇచ్చిన ధీమాతోనే ‘బోర్డర్ 3’ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ మూడవ భాగంలో కూడా సన్నీ డియోల్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారని సమాచారం ఉండగా.. మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ అదే దేశభక్తిని వెండితెరపై ఆవిష్కరించి, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందుతున్నామని, అందుకే ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ‘బోర్డర్ 3’తో కొనసాగిస్తున్నామని నిర్మాతలు సగర్వంగా ప్రకటించారు.
#BreakingNews… BHUSHAN KUMAR – NIDHI DUTTA JOIN FORCES FOR ‘BORDER 3’… After the phenomenal success of #Border2, which has registered an exceptional opening weekend at the boxoffice, #BhushanKumar [#TSeries] and #NidhiDutta [#JPFilms] are set to carry the iconic franchise… pic.twitter.com/cwG3G3kzLu
— taran adarsh (@taran_adarsh) January 27, 2026