Bhola Shankar | “చిరంజీవి సినిమాకు నీవు సంగీత దర్శకత్వం చేస్తున్నావ్’ అని దర్శకుడు మెహర్ రమేష్ నాతో అనగానే నేను నమ్మలేదు. జోక్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ తరువాత రోజు కథ చెప్పారు. షాక్‌తో పాటు నా కల నిజమైంది’ అన్నారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్. అగ్రనటుడు చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించారు. ఆగస్టు 11న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మహతి స్వరసాగర్ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘చిరంజీవి లాంటి గొప్ప నటుడి చిత్రానికి సంగీతం అందించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రం సంగీతం విషయంలో ప్రతిదీ కేర్ తీసుకుని చేశాను.
ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ట్యూన్‌ను నాన్నకు వినిపించాను. ఆయన సూచనలు పాటించాను. ‘ఎంత మాస్ సాంగ్ వున్నా మెలోడి వుండాలి. అదే నిన్ను పదేళ్ళ తరువాత గుర్తిస్తుంది. అది మిస్ కావద్దు అనే వారు. అది తు.చ.తప్పకుండా పాటిస్తున్నా. ఈ సినిమా విషయంలో చిరంజీవి చాలా సలహాలు ఇచ్చారు. ప్రతి పాటలో ఆయన ఇన్పుట్స్ వున్నాయి. ఆయన్ను కలవడమే గొప్ప అనుభవం. స్టూడియో నుంచి రెండేళ్ల నాడు ట్యూన్ రెడీ చేసుకుని చిరంజీవికి వినిపించాలనుకున్నప్పుడు జర్నీలో చాలా టెన్షన్ పడ్డా. ఒప్పుకుంటారో లేదో అనే ఆలోచన వుండేది. అలా ఓ రోజు సెట్లో కలిసి ట్యూన్ వినిపించా. విన్నాక చెవిలో తుప్పు వదిలించావ్ అన్నారు. నాకు మణిశర్మ అబ్బాయి కంటే మహతి స్వరసాగర్ అనే పేరు తెచ్చుకోవడం ఇష్టం. నా పాటలకు మా ఇంట్లోనే మంచి క్రిటిక్స్ వున్నారు. ఏదైనా ట్యూన్ కడితే నిర్మోహమాటంగా తమ అభిప్రాయం చెప్పేస్తారు. వారిని దాటి నా పాట వచ్చిదంటే గొప్ప రిలీఫ్‌గా వుంటుంది’ అన్నారు.