‘నేను కళాకారుడ్ని. ప్రజలతో మమేకమై ఉంటాను. వాళ్లకేం కావాలో వాళ్ల దగ్గరి నుంచే తీసుకొని, తిరిగి వాళ్లకే ఇస్తుంటాను. ప్రస్తుతం నేనున్న స్థాయి నా క్రెడిట్ అని మాత్రం నేను అనుకోను’ అంటున్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు. ఇటీవల బలగం, ధమాకా, మ్యాడ్ చిత్రాలు సంగీత దర్శకునిగా భీమ్స్కు మంచి పేరుతెచ్చాయి.
వెంకటేశ్ హీరోగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘సంక్రాతికి వస్తున్నాం’ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. ఈ నెల 14న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం భీమ్స్ విలేకరులతో ముచ్చటించారు. ‘13ఏళ్ల క్రితం అనిల్ రావిపూడితో ‘పటాస్’ సినిమాకు పనిచేశాను. మళ్లీ ఇన్నాళ్లకు ‘సంక్రాంతికి వస్తున్నాం’కి పనిచేశాను.
ఈ అవకాశం రావడం, ఆల్బమ్ పెద్ద హిట్ అవ్వడం, వెంకటేశ్ నా ఆల్బమ్‌లో పాట పాడటం, రమణగోగుల నా మ్యూజిక్ డైరెక్షన్లో పాడేందుకు ఒప్పుకోవడం ఇవన్నీ తిరుమల శ్రీవారి కృప వల్లే సాధ్యమైంది. ప్రస్తుతం ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘గోదారిగట్టు’ పాట 70 మిలియన్ వ్యూస్ దాటేసింది. రమణగోగుల, మధుప్రియ ఈ పాట పాడటం గౌరవంగా భావిస్తున్నా. నేను ఎదిగానని భావించను. దేవుడు నాకు పని ఎక్కువ ఇచ్చాడు.. అంతే. దీనివల్ల ఎక్కువ మందికి పనిచ్చే అవకాశం నాకు కలిగింది. ప్రస్తుతం మ్యాడ్2, మాస్ జాతర, టైసన్ నాయుడు, డెకాయిట్ సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నాను’ అని భీమ్స్ చెప్పారు.