సినిమాలకు భిన్నమైన పేర్లు పెట్టడంలో దిట్ట పూరీ జగన్నాథ్. తొలి సినిమా ‘బద్రి’ నుంచి చూసుకుంటే, దాదాపుగా ఆయన సినిమాల పేర్లన్నీ కొత్తగానే ఉంటాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఆయన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఎవరి ఊహలకూ అందని పేరుని అనుకుంటున్నారట పూరీ. వివరాల్లోకెళ్తే.. ఇది పానిండియా ప్రాజెక్ట్ కావడంతో.. ‘బెగ్గర్’ అనే పేరుని ముందు ఈ సినిమా కు టైటిల్‌గా అనుకున్నారట. అయితే.. ఆ టైటిల్‌కి విజయ్‌సేతుపతి అభ్యంతరం చెప్పారట.
‘బెగ్గర్’ అనే టైటిల్ తెలుగులో అయితే ఓకే.. తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ ఇంగ్లిష్ టైటిల్‌ని అంగీకరించరని ఆయన నిర్మొహమాటంగా చెప్పేశారట. పైగా ‘పిచ్చైకారన్'(తెలుగులో ‘బిచ్చగాడు’) అనే సినిమా అక్కడ కూడా అఖండ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అందుకే అదే అర్థం వచ్చేలా, అన్ని భాషలకూ సరిపోయేలా ఓ మంచి టైటిల్ అనుకోండని విజయ్ సేతుపతి సలహా ఇచ్చారట.
దాంతో.. అన్ని భాషలకూ కలిసొచ్చేలా ‘భవతీ భిక్షాందేహి..’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట పూరీ. ‘భవతీ భిక్షాందేహీ’ అనేది సంస్కృత పదం కాబట్టి, ఏ భాషలోనూ సమస్య రాదని పూరీ ఆలోచన. మరి ఈ టైటిల్ ఖరారవుతుందా? లేదా? అసలు ఈ వార్తలో నిజం ఉందా? లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.