Bhartha Mahasayulaku Wignyapthi | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ కంబ్యాక్ దొరికింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఫ్యాన్స్‌కు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రూపంలో కిషోర్ తిరుమల ఒక అదిరిపోయే సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు. భార్యకు, ప్రేయసికి మధ్య నలిగిపోయే సగటు భర్త కథను వినోదాత్మకంగా మలిచి, బాక్సాఫీస్ వద్ద రవితేజ మార్క్ మ్యాజిక్ రిపీట్ చేశారు.
కథ
రామ్ సత్య నారాయణ (రవితేజ) ఒక సక్సెస్ఫుల్ వైన్ యార్డ్ ఓనర్. తన కంపెనీ డీల్ కోసం స్పెయిన్ వెళ్ళిన రామ్, అక్కడ ఎండీ మానస శెట్టి (ఆషికా రంగనాథ్)తో ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే రామ్‌కు బాలమణి (డింపుల్ హయతి)తో పెళ్లై ఉంటుంది. ఈ నిజాన్ని దాచి మానసకు దగ్గరైన రామ్, ఆమె తిరిగి ఇండియాకు వచ్చాక ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అటు భార్యను, ఇటు ప్రేయసిని మేనేజ్ చేస్తూ రామ్ చేసిన హంగామా ఏంటి? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ
ఒక భార్య, ఒక ప్రేయసి.. మధ్యలో మొగుడు – ఇది పాత ఫార్ములానే అయినా, కిషోర్ తిరుమల దీనికి Gen-Z స్టైల్లో మీమ్స్ మరియు ట్రెండీ డైలాగ్స్‌తో కొత్త రంగులు అద్దారు. సినిమా నెమ్మదిగా మొదలైనా, మానస ఇండియాకు వచ్చాక అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న చిన్నపాటి లోటును సెకండ్ హాఫ్‌లోని నాన్-స్టాప్ కామెడీ కవర్ చేసేసింది. రవితేజ తన వింటేజ్ ఎనర్జీతో చెలరేగిపోయారు. గ్లామర్ పరంగా ఆషికా రంగనాథ్ బికినీ సీన్లతో మెరుపులు మెరిపిస్తే, డింపుల్ హయతి హోమ్లీ వైఫ్‌గా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్, సత్యల కామెడీ సీన్లు థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించాయి.
సాంకేతికంగా
దర్శకుడిగా కిషోర్ తిరుమల ఈ సినిమాతో హిట్టు అందుకున్నాడని చెప్పవచ్చు. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫీ సినిమాను చాలా రిచ్‌గా చూపించింది. స్పెయిన్ లొకేషన్స్ కనువిందు చేస్తాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఫైనల్‌గా సంక్రాంతికి కాసులు కురిపించే సినిమా ఇది. ఎన్నో ఏళ్లుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఈ సినిమా కంబ్యాక్ అవుతుంది. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకు వెళ్తే మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు.
ప్లస్ పాయింట్లు:
రవితేజ వింటేజ్ కామెడీ టైమింగ్.
సెకండ్ హాఫ్‌లో వచ్చే హిలేరియస్ సీన్లు.
ఆషికా రంగనాథ్ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్.
ఆకట్టుకునే మీమ్ డైలాగ్స్.
మైనస్ పాయింట్లు:
అక్కడక్కడా సాగదీతగా అనిపించే సీన్లు.
పాటల ప్లేస్మెంట్ మరికొంత జాగ్రత్తగా ఉండాల్సింది.
చివరిగా.. పెద్దగా లాజిక్కులు వెతక్కుండా, పండగ పూట సరదాగా నవ్వుకోవాలి అనుకునే వారికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. రవన్న ఫ్యాన్స్‌కు ఇది ఖచ్చితంగా ‘ధమాకా’ లాంటి కంబ్యాక్ మూవీ.